పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు
* రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం
* జిల్లా ఆసుపత్రి కాదు రిఫరల్ సెంటర్గా మారింది!
* తాగునీరు, అపరిశుభ్రత, వైద్యుల లేమి రోగులకు నరకయాతన
* ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రం పనిచేయకయడం లేదు
* ఆస్పత్రి నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించాలి
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆసుపత్రిని సందర్శించాలి
* జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి
* భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
* జిల్లా ఆస్పత్రి సందర్శన
భూపాలపల్లి, ఆగస్టు 2 (విజయక్రాంతి): పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారని రాజకీయాల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని జిల్లా ఆసుపత్రి కాదు రిఫరల్ సెంటర్గా మారిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా ప్రధాన ఆసుపత్రిని మాజీ ఎమ్మెల్యే బిఆర్‌ఎస్ నాయకులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా అన్ని విభాగాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రస్తుతం సమస్యల కేంద్రంగా మారిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తాగునీటి కొరత, అపరిశుభ్రత, కనీస సౌకర్యాల లేమితో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐదు రోజులుగా తాగునీరు అందక రోగులు బయట నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
ఇటీవల ప్రారంభించిన ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రం పనిచేయకపోవడం, అవసరమైన వైద్యులు లేకపోవడం దారుణమన్నారు. చిన్న సమస్య వచ్చినా ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇది జిల్లా ఆసుపత్రా? లేక రిఫరల్ సెంటరా? అని ప్రశ్నించారు. టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటం, కొన్ని మూసివేయడం, ఆక్సిజన్ ప్లాంట్ సమస్యలు, నిరుపయోగంగా పడిన ట్రాన్స్ఫార్మర్ వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆదివారాల్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం పట్ల కూడా ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జిల్లా ఆసుపత్రిపై నిరంతర సమీక్షలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించామని, కానీ ప్రస్తుతం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోందని విమర్శించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే జిల్లా ప్రధాన ఆసుపత్రిని సందర్శిస్తే ఇక్కడి పరిస్థితులు అర్థం అవుతాయని అన్నారు. ఆస్పత్రి నిర్వహణకు ప్రత్యేక అధికారిని నియమించి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన తాగునీరు, పరిశుభ్రత, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, మందులు, పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ఆసుపత్రిని బలోపేతం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.






