16 April, 2026 | 1:56 AM

ఖర్గే సీటుపై రేవంత్ కన్నేశారు!

16-04-2026 12:58 AM

అందుకే డీలిమిటేషన్‌పై డైవర్షన్ పాలిటిక్స్ 

ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యం పెరగడం కాంగ్రెస్‌కు ఇష్టంలేదా?

బీజేఎల్పీ నేత ఏ.మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన నేషనల్ పొలిటికల్ ప్రమోషన్ కోసం, మల్లికార్జున్ ఖర్గే సీటుపై కన్నేసి, గాంధీ కుటుంబం దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ‘జగన్నాటకం’ ఆడుతున్నారని, అందుకే డీలిమిటేషన్‌పై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీయే ఇచ్చిందని రేవంత్‌రెడ్డి చెప్పడం బీఆర్ అంబేద్కర్‌ను ఘోరంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ అనే ది ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి పది ఏళ్లకు జరిగే సెన్సస్ ఆధారంగా చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియని, దీనిపై సీఎంకి కనీస అవగాహన లేదన్నారు.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి నాయకులు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లు పెరగడం రేవంత్‌రెడ్డికి ఇష్టం లేదా? ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యం పెరగడం కాంగ్రెస్ చూడలేకపోతోందా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ప్రతిపాదిస్తున్న ‘హైబ్రిడ్ పాలసీ’ లేదా ‘జీఎస్డీపీ మోడల్’ అనే దానికి అసలు రాజ్యాంగబద్ధత లేదని కొట్టిపారేశారు.

జీఎస్డీపీ అంటే ‘గాంధీస్ డీలిమిటేషన్ ప్రొసీజర్’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పన్నులు కట్టే ప్రాంతాలకే ఎక్కువ సీట్లు ఇవ్వాలనేది రేవంత్‌రెడ్డి కొత్త నరేటివ్ అని విమర్శించారు. ఇదే పద్ధతిని రాష్ట్రంలో అమలుచేస్తే, రెవెన్యూ తక్కువగా ఉండే ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ వంటి వెనుకబడిన జిల్లాల్లో సీట్లు తగ్గించి, కేవలం హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలకే సీట్లు పెంచుతారా? ఇది పేదలను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర కాదా? అని ప్రశ్నించారు.

బ్రిటిష్ వారి ‘డివైడ్ అండ్ రూల్’ పాలసీని రేవంత్‌రెడ్డి పుణికిపుచ్చుకున్నారని, నార్త్-, సౌత్ విభజన రాజకీయం చేస్తూ దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, దేశ రాజకీయాల గురించి లెటర్లు రాయడం రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్ పాలిటిక్స్‌కు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు మానుకుని, దక్షిణాదికి మేలు చేసే మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుకు పార్లమెంటులో మద్దతు తెలపాలని హితవు పలికారు.