గజ్వేల్‌లో ముగిసిన డివిజన్ స్థాయి చెస్ పోటీలు
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో రెండు రోజులపాటు నిర్వహించిన డివిజన్ స్థాయి చెస్ పోటీలు సోమవారం ఘనంగా ముగిసాయి. స్వామి వివేకానంద సేవా సమితి, రాచకొండ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.సి. సంతోష్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
గెలుపు, ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. ప్రస్తుతం కబడ్డీ, క్రికెట్ వంటి క్రీడలకే అధిక ప్రాధాన్యం లభిస్తున్న తరుణంలో చెస్ వంటి ఇండోర్ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. గజ్వేల్‌లో డివిజన్ స్థాయి చెస్ పోటీలను విజయవంతంగా నిర్వహించిన హరీష్ రెడ్డి ఆధ్వర్యంలోని నిర్వాహక బృందాన్ని అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు.






