వినాయక ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదు
డీజే ఆపరేటర్లకు గణపురం ఎస్ఐ కౌన్సెలింగ్ బైండోవర్
గణపురం,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గణపురం పోలీసులు(Ganapuram Police) ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం మండలంలోని డీజే ఆపరేటర్లను గణపురం ఎస్ఐ బొరగల అశోక్(Ganapuram SI Boragala Ashok) పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సమయంలో డీజేలు వినియోగించరాదని ఎస్ఐ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. అనంతరం డీజే ఆపరేటర్లను బైండోవర్ చేసి, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తామని హామీ తీసుకున్నారు. వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ అశోక్ విజ్ఞప్తి చేశారు.