26 April, 2026 | 3:24 AM

కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు

20-12-2024 05:38 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం సాయంత్రం విచారణ జరిగింది. ఫార్ములా- ఈ కార్ రేస్ అంశంలో ఏసీబీ కేసుపై కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదనాలు ముగిసాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సుందరం వాదనలు వినిపించారు. ఏసీబీ ఏఫ్ఐఆర్ కొట్టివేయాలని కేటీఆర్ లాయర్ వాదించారు. మద్యంతర ఉత్తర్వులు ఇవ్వోద్దని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టును కోరారు. కేటీఆర్ ను వారం రోజుల వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపిన కోర్టు కేసు విచారణను ఈనెల 27 కు వాయిదా వేసింది. దీంతో ఫార్ములా- ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు ఊరట లభించింది.

నగదు బదిలీ అయిన ఫార్ములా సంస్థను ఎఫ్ఐఆర్ లో చేర్చలేదని కేటీఆర్ తరపు లాయర్ సుందరం వెల్లడించారు. అక్రమాలు జరిగాయని ఎలా చెబుతారు...? అని లాయర్ సుందరం ప్రశ్నించారు. సొంత అవసరాలకు డబ్బు వాడుకుంటేనే నేరం అవుతుందన్నారు. ఈ కేసులో సొంతానికి డబ్బు వాడుకున్న ఘటనే లేదని న్యాయవాది సుందరం స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమేనని ఏజీ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలే అంతిమం కాదని, దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తామని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ అంశంపై రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించి, కేసు నమోదుపై గవర్నర్ నిర్ణయానికి పంపారని ఆయన పేర్కోన్నారు. గవర్నర్ ఆమోదించాక కేసు నమోదు చేశారని తెలిపారు. గవర్నర్ అనుమతి కాపీని కోర్టు అడగడంతో అందించారు. ఫార్ములా సంస్థకు డబ్బు విదేశీ కరెన్సీలో చెల్లించారని చెప్పారు. విదేశీ కరెన్సీలో చెల్లింపుతో హెచ్ఏండీఏపై అధిక భారం పడిందన్న ఏజీ సుదర్శన్ విదేశీ కరెన్సీలో చెల్లింపు కోసం ఆర్బీఐ అనుమతి తీసుకోలేదని ఆరోపించారు.