26 April, 2026 | 4:55 AM

కేటీఆర్‌పై పెట్టింది డొల్ల కేసు: హరీశ్ రావు

20-12-2024 07:03 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తొలి అడుగులోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నైతిక విజయం సాధించారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేటీఆర్ పై పెట్టింది డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిందన్నారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో చర్చించాలని కోరితే బీఆర్ఎస్ సభ్యులను శాసన సభ నుంచి బయటికి పంపి చర్చించారని హరీశ్ రావు ఆరోపించారు. ఈ కారు రేస్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారు. డిసెంబర్ 22వ తేదీన దానం కిశోర్ కు  ఏవీవీ కంపెనీకి మూడో విడత కింద 45 లక్షల పౌండ్లు చెల్లించకపోవడంతో అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నామని  లేఖ రాసినట్లు గుర్తు చేశారు.

50 శాతం నిధులు అంటే కేవలం 45 కోట్లు మాత్రమే అని, రూ.45 కోట్లు చెలిస్తే ఫార్ములా ఈ-కార్ రేసింగ్ తో రాష్ట్రానికి రూ.600 కోట్ల లాభం వచ్చేదని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అప్పటికే జరిగిన ఈ కార్ రేసింగ్ వల్ల తెలంగాణకు రూ.600 కోట్ల లాభం వచ్చిందని నీల్సన్ అనే సంస్థ తెలిపిందన్నారు. రేసింగ్ నిర్వహించిన సంస్థకు హెచ్ఎండీఏ నుంచి జరిగిన చెల్లింపుల్లో ప్రొసీజర్స్ లాప్స్ మాత్రమే జరిగి ఉండవచ్చని వెల్లడించారు. నిధుల చెల్లింపుల్లో ఇర్రెగ్యులారిటీ తప్ప, ఇల్లీగల్ మాత్రం లేదని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వల్ల తెలంగాణ ప్రతిష్ఠత పెరిగింది తప్ప తగ్గాలేదన్నారు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఫార్ములా-4 నిర్వహించి రూ.140 కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు.

సభలో అధికార పక్షాన్ని నిలదీయకుండా ఉండాలని కేటీఆర్ పై తప్పుడు కేసులు పెడుతున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చు పెట్టి ఆఫ్రో ఏసియన్ గేమ్స్ నిర్వహించిందన్నారు. తన ఏడాది పాలన వైఫల్యం నుంచి దృష్టి మరల్చేందుకు గిమ్మిక్కులు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి చర్యల వల్ల రాష్ట్ర పరపతి, ఇమేజ్ దెబ్బ తింటోందని హరీశ్ రావు ఆరోపించారు. సీఎం కుటుంబ అవినీతిని ఎప్పటికప్పుడు కేటీఆర్ బయటపెడుతున్నారు కాబట్టే సర్కార్ అక్రమ కేసులు పెడుతుందన్నారు. ఫార్ములా రేసింగ్ నిర్వహించేందుకు 192 దేశాలు పోటీ పడ్డాయని, మొదటి దఫాలో రూ.30 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి రూ.71 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.