భూ భారతి బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ
20-12-2024 05:15 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): భూ భారతి బిల్లు-2024ను తెలంగాణ శాసన సభ శుక్రవారం ఆమోదించింది. భూభారతి బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ కొత్త రెవెన్యూ చట్టం భూ సమస్యల నివారణకు దోహదపడుతుందని, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020 స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ప్రధాన జీవనాధారమని తెలిపిన మంత్రి పొంగులేటి ప్రజల్లో భూ పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా ఈ బిల్లు చేస్తుందన్నారు. మూజువాణి ఓటుతో భూ భారతి బిల్లును శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆమోదించారు. అనంతరం సభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.






