పంటల మిగులు అవశేషాలు, కాల్చవద్దు
మునుగోడు, మే 21: రైతులు పంట పొలాల్లో మిగిలిన పంటల మిగులు అవశేషాలను చవద్ద వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో పంట అవశేషాలను త్వరితగతిన తొలగించేందుకు రైతులు వరి, పత్తి పంట అవశేషాలను కాల్చిన వ్యవసాయ భూములను పరిశీలించి మాట్లాడారు.
ఈ విధమైన చర్యల వలన భూమిలోని సేంద్రియ పదార్థం, ముఖ్యమైన పోషకాలు,ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించిపోతాయన్నారు. అదేవిధంగా గాలి కాలుష్యం పెరిగి, పర్యావరణానికి ముప్పు వాటిల్లి ప్రజల ఆరోగ్యానికి హానికర పరిస్థితులు ఏర్పడతాయన్నారు. అందుకే రైతులు వరి గడ్డి, పత్తి అవశేషాలను కాల్చకుండా పొలంలోనే దున్ని భూమిలో కలపాలని సూచించారు.ఇలా చేయుట వలన భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి, నేల సారవంతత మెరుగుపడుతుంది.
భూమి నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరగడంతో పాటు, సూక్ష్మజీవుల క్రియాశీలత కూడా అభివృద్ధి చెందుతుంది. దీర్ఘకాలంలో రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గుతుందని అన్నారు. ఎకరాకు రెండు బస్తాలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేయడం ద్వారా పంట అవశేషాలు త్వరగా కుళ్లిపోవడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎం. నరసింహ, బి. నేతాజీ, రైతులు ముంతా మారేష్, బొల్లం ముత్తమ్మ, జాజుల మారయ్య, అందుకూల సాయిలు, పగిళ్ల సత్తయ్య, పంతంగి రాములు పాల్గొన్నారు.






