మద్యం తాగి వాహనాలు నడపొద్దు
అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా
సిద్దిపేట క్రైం, ఏప్రిల్ 16 : మద్యం తాగి వాహనాలు నడపవద్దని అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా డ్రైవర్లకు సూచించారు. ’అరైవ్ ఆలైవ్’ ప్రోగ్రాంలో భాగంగా గురువారం సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అతివేగంతో వాహనాలు నడిపవద్దని సూచించారు. ప్రయాణ సమయాల్లో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని సూచించారు.
నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమతోపాటు ఇతరులకు హాని కలిగించవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ను అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా అభినందించారు. సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ, లారీ, స్కూల్ బస్సు, ట్రక్కులు వంటి భారీ వాహనాల డ్రైవర్లు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దన్నారు. అనంతరం డ్రైవర్ల చేత ట్రాఫిక్ నియమాలను పాటిస్తామని, మద్యం తాగి వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు చేయడంతో పాటు సీపీఆర్ పై అవగాహన కల్పించారు.






