5 August, 2026 | 9:42 AM

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు: ట్రాఫిక్ ఏసీపీ

05-08-2026 08:55 AM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని లయన్స్ ఆస్పత్రి ప్రాంగణంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, వివిధ సంస్థల ప్రతినిధులతో మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా అవగాహన కల్పించే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే తల్లిదండ్రులు కూడా చట్టపరమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బోధన్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ, తల్లిదండ్రులకు, విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. పట్టణ సీఐ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, విద్యాసంస్థల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ఎంఏ (TRSMA) జిల్లా అధ్యక్షుడు కొడాలి కిషోర్ మాట్లాడుతూ, బస్టాండ్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్ ఘటనలను నివారించేందుకు పోలీసు శాఖ మరింత నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, వికాస్, శ్రీనివాస్, మశి విజయ్ కుమార్, లక్ష్మీ సురేష్, చిరంజీవి, చక్రవర్తి, సుబ్బారావు, చౌడారెడ్డి, మైనారిటీ విద్యాసంస్థల ప్రతినిధులు, జావిద్ తదితరులు పాల్గొన్నారు