విద్యార్థి సమస్యలపై పోరు.. ఆగస్టు 6న SFI ధర్నా
రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్, బకాయిలు వెంటనే విడుదల చేయాలి
మేడిపల్లి,(విజయక్రాంతి):పెండింగ్‌లో ఉన్న సుమారు రూ 10,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న బోడుప్పల్ బస్ స్టాప్ వద్ద ‘మహా ధర్నా’ నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ ప్రకటించింది. ఈ సందర్భంగా మంగళవారం ధర్నా పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, హాల్‌టికెట్లు, మెమోలు, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని మండిపడ్డారు.
దీనివల్ల విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.ఆగస్టు 6న జరిగే ఈ మహా ధర్నాలో విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అవినాష్, ఉపాధ్యక్షుడు భగత్, మండల నాయకులు కౌశిక్, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.






