మంథని పట్టణంలో సీసీ రోడ్డే పార్కింగ్ స్థలమా..?
ద్విచక్ర వాహనాలు, మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లతో ప్రజలకు నరకయాతన
కోట్లతో నిర్మించిన రోడ్డు ఆక్రమణల పాలైతే.. పట్టించుకోని మున్సిపల్, పోలీసు అధికారులు
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని పట్టణంలో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా మారిపోయిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినీ వ్యాన్లు, డీసీఎం వ్యాన్లను ఇష్టారాజ్యంగా రోడ్డుపైనే గంటల తరబడి నిలిపివేస్తుండటంతో ప్రజల రాకపోకలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మంథని పట్టణంలోని శ్రీపాద చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, సిఆర్ కే అపార్ట్మెంట్, పాత పెట్రోల్ బంక్, బస్సు డిపో ఏరియాల్లో రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు పార్క్ చేయడంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఒకదానికొకటి దారి ఇచ్చుకుంటూ ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు కూడా సకాలంలో వెళ్లలేని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోట్లతో రోడ్లు వేస్తే... ప్రయోజనం ఎక్కడ
ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు నిర్మిస్తుంటే, వాటిని కొందరు శాశ్వత పార్కింగ్ స్థలాలుగా మార్చడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అవుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్డుపై పార్కింగ్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్ప ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు.
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమా..?
పట్టణంలోని రోడ్డుపై అక్రమంగా నిలిపివేస్తున్న భారీ వాహనాలపై మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు ఉన్న అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి
రోడ్డుపై పార్కింగ్ చేస్తున్న వాహన యజమానులను వెంటనే గుర్తించి తొలుత హెచ్చరించాలని, ఆ తర్వాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించి, అవసరమైతే వాహనాలను సీజ్ చేయాలని స్థానికులు పోలీసులను, మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. అక్రమ పార్కింగ్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సీసీ రోడ్డును పూర్తిగా ఆక్రమణల నుంచి విముక్తం చేసి ప్రజల రాకపోకలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అధికారులకు చేస్తున్నారు.






