కెనడా చదువులు మాకొద్దు బాబోయ్..
- సగానికి పైగా తగ్గిన విద్యార్థులు
అక్కడి చట్టాలే ముఖ్య కారణం
ఆస్ట్రేలియా వెళ్లేందుకు విద్యార్థుల మొగ్గు..
మనోళ్ల మీదే అక్కసు..
న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువులు చదవాలనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. కెనడా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య నిరుటితో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గిపోయింది. కెనడాలో ఉన్న వసతుల గురించి వివరిస్తూ కనిపించే హోర్డింగ్‌లు కనపించకుండా పోవడం గమనార్హం. పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కెనడా కొత్తగా తీసుకొచ్చిన కఠిన చట్టాలే దీనికి కారణంగా తెలుస్తోంది.
ఇక అలా చేసేందుకు వీలులేదు
కొత్త చట్టాల ప్రకారం కెనడాలోకి ప్రవేశించిన తర్వాత విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు అప్లు చేసుకునేందుకు వీలు లేదు. కెనడా గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత ఈ విధంగా అప్లు చేసుకోవడాన్ని జూన్ 21 నుంచి నిషేధించారు. మునుపు పర్యాటక వీసాతో కెనడాలోకి అడుగుపెట్టాక కూడా ఆ వీసాలను వర్క్ పర్మిట్ వీసాలుగా మార్చుకునే సౌలభ్యం ఉండేదని వేర్వేరు కారణాల వల్ల ప్రభుత్వం ఆ సౌలభ్యాన్ని తొలగించిందని ఇమ్మిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ గుట్రేజ్ సంధు తెలిపారు. ఇదే ఏడాది జనవరిలో కెనడా ప్రభుత్వం పలు సర్టిఫికెట్ల ఫీజులను కూడా పెంచింది. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లకు వర్క్ పర్మిట్లను కూడా రద్దు చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే వర్క్ పర్మిట్ పొందేందుకు అర్హులని కెనడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిబంధన కూడా అనేక మంది విద్యార్థులు తమ మనసులు మార్చుకునేందుకు కారణం అయింది. కెనడాకు అత్యధికంగా వెళ్లే చంఢీగడ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. వర్క్ పర్మిట్లలో కొత్త నిబంధనలు తీసుకురావడం వల్లే అక్కడికి వెళ్లాలని అనుకుంటున్న విద్యార్థుల సంఖ్యలో భారీ తగ్గింపు కనబడుతోందని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత ప్రాధాన్యత రంగాలలో విద్యనభ్యసించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు వర్క్ పర్మిట్లు ఇవ్వనున్నట్లు కెనడా ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. కెనడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనే విద్యార్థులను మాత్రమే కాకుండా.. అక్కడి పర్యాటక వీసా మీద వెళ్లి.. వర్క్ పర్మిట్ తెచ్చుకోవాలని భావించే వారిని కూడా ప్రభావితం చేసిందని ఇమ్మిగ్రేషన్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కెనడాకు వెళ్లాలని ఇప్పటికీ భావిస్తున్న అనేక మంది భారతీయ విద్యార్థుల అప్లికేషన్లు తిరస్కరించబడుతున్నాయి. అదే సమయంలో ఘనా, బంగ్లాదేశ్, సెనెగల్ వంటి దేశాల నుంచి వస్తున్న విద్యార్థులకు అనేక స్టడీ పర్మిట్లు లభిస్తున్నాయి. కెనడా ప్రభుత్వ నిర్ణయాల వల్ల అనేక మంది భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో విద్యనభ్యసించేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ ఆస్ట్రేలియా కూడా 48 గంటల వర్క్ వీక్ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.






