13 July, 2026 | 9:46 PM

Breaking News

నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •  

రెండోసారి ఓం బిర్లానే

27-06-2024 01:06 AM

మిల్ జుల్‌కర్..!

  1. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన కోటా ఎంపీ
  2. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సురేశ్‌పై విజయం
  3. వరుసగా రెండోసారి ఎన్నికైన ఐదో వ్యక్తిగా రికార్డు 

న్యూఢిల్లీ, జూన్ 26: 18వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. దేశంలో 48 ఏళ్ల తర్వాత స్పీకర్‌కు ఎన్నికలు నిర్వహించగా అధికార కూటమి ప్రతిపాదించిన ఓం బిర్లా.. కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్‌పై గెలుపొందారు. వరుసగా రెండోసారి ఈ పదవి చేపట్టిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా ఘనత సాధించారు. అంతేకాకుండా ఈ ఐదేళ్లు ఆయన స్పీకర్‌గా కొనసాగితే అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న వ్యక్తిగా బలరామ్ ఝాఖడ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.

బలరామ్ 9 ఏళ్ల 329 రోజులు లోక్‌సభ సభాపతిగా విధులు నిర్వహించారు. స్పీకర్ పదవిపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నిక అని వార్యమైంది. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. సభాపతిగా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీర్మానం ప్రవేశ పెట్టారు. దీన్ని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు ఎన్డీయే సభ్యులు బలపరిచారు. ఇండియా కూటమి తరఫున కే సురేశ్ పేరును శివసేన (ఉద్ధవ్) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం ప్రవేశపెట్టగా తృణమూల్ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు మద్దతునిచ్చారు. అనంతరం మూజువాణి విధానంలో ఓటింగ్ చేపట్టగా ఓం బిర్లా గెలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు. 

వ్యాపారవేత్త నుంచి..

ఓం బిర్లా 1962 నవంబర్ 23న రాజస్థాన్‌లోని కోటాలో జన్మించారు. వ్యాపారవేత్తగా జీవితం ప్రారంభించిన ఆయన బీజేపీలో చేరి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగారు. 2014 నుంచి వరుసగా మూడుసార్లు కోటా నుంచి ఎంపీగా గెలుపొందారు. 16వ లోక్‌సభలో 86 శాతం హాజరు నమోదు చేసుకున్నా రు. మొత్తం ఐదేళ్లలో 671 ప్రశ్నలు అడిగారు. ఆ వెంటనే 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 

నాలుగోసారి జరిగిన ఎన్నిక 

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగడం ఇది నాలుగోసా రి. ఇంతకుముందు 1952, 1967, 1976లో మాత్రమే స్పీకర్ నియామకం ఎన్నిక ప్రక్రియ ద్వారా జరిగింది. మిగతా అన్ని లోక్‌సభల్లో సభాపతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

  1. * 1952 మొదటి లోక్‌సభలో అప్పటి ప్రధాని నెహ్రూ జీవీ మావలంకార్‌ను స్పీకర్ అభ్యర్థిగా ప్రతిపాదించారు. కానీ, శాంతారాం మోరేకు అనుకూలంగా సీపీఐ ఎంపీ ఏకే గోపాలన్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో తొలి సభకు జరిగిన ఎన్నికలో జీవీ మావలంకార్ స్పీకర్‌గా గెలుపొందారు. 
  2. * 1967లో ఇందిరాగాంధీ తొలిసారి ప్రధాని అయినప్పుడు కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. పాత కాంగ్రెస్‌కు చెందిన నీలం సంజీవరెడ్డి, ఇందిరా కాంగ్రెస్‌కు చెందిన తెన్నేటి విశ్వనాథంకు అనుకూలంగా రెండు తీర్మానాలు వచ్చాయి. ఈ ఎన్నికలో రహస్య ఓటింగ్ నిర్వహించగా సంజీవరెడ్డికి 278 ఓట్లు, తెన్నేటికి 207 ఓట్లు వచ్చాయి. 
  3. * 1976 ఎమర్జెన్సీ సమయంలో బలిరామ్ భగత్‌ను ప్రధాని ఇందిరాగాంధీ ప్రతిపాదించగా మరో కాంగ్రెస్ ఎంపీ పీఎం మెహతా జగన్నాథరావు జోషీకి అనుకూలంగా తీర్మానాన్ని సమర్పించారు. ఈ ఎన్నికలో బలిరామ్ భగత్ గెలుపొంది సభాపతి అయ్యారు.  

మోదీ, రాహుల్ కరచాలనం 

స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లా గెలిచనట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే ఆయన వద్ద కు వెళ్లి ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత హోదా లో రాహుల్‌గాంధీ కరచాలనం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బిర్లాకు పోడియంపైకి ఆహ్వానం పలుకుతూ మోదీ, రాహుల్ ఒకరికొకరు నవ్వుతూ షేక్‌హ్యాండ్ చేసుకున్నారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజుతో కలిసి మోదీ, రాహుల్ ఓం బిర్లాను సభాపతి పీఠంపై కూర్చొబెట్టారు. అంతేకాకుండా చాలా రోజులుగా టీషర్ట్ ధరిస్తూనే కనిపించిన రాహుల్.. బుధవారం సభకు లాల్చీ పైజామాతో రావడం విశేషం. 

వరుసగా రెండుసార్లు 

ఓం బిర్లా వరుసగా ఎన్నికైన ఐదో స్పీకర్‌గా రికార్డు సృష్టించారు. ఆయనకు ముందు ఎంఏ అయ్యంగార్ (1956, 1957), గుర్‌దయాల్ సింగ్ ధిల్లాన్ (1969, 1971), బలరామ్ ఝాఖడ్ (1980, 1985), జీఎంసీ బాలయోగి (1998, 1999) వరుసగా ఎన్నికైన వారి జాబితాలో ఉన్నారు. కాగా వీరిలో బలరామ్ ఝాఖడ్ మాత్రమే పదేళ్లు స్పీకర్ పదవిలో కొనసాగడం గమనార్హం. ప్రస్తుతం ఓం బిర్లా విజయవంతంగా ఐదేళ్లుగా ఈ పదవిలో కొనసాగితే ఎక్కువ కాలం స్పీకర్‌గా ఉన్న రికార్డు ఆయన సొంతమవుతుంది. నీలం సంజీవరెడ్డి సైతం రెండుసార్లు స్పీకర్‌గా పనిచేశారు. కానీ ఆయన వరుసగా గెలుపొందలేదు. 1967, 1997 లోక్‌సభకు సభాపతిగా నీలం వ్యవహరించారు.