తేజస్వి మాటలను భూతద్దంలో పెట్టి చూడొద్దు
ఆయన మాట్లాడిన దాంట్లో అంతరార్థం వేరు
బీఆర్‌ఎస్‌ది అనవసర రాద్ధాంతం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): బీజేపీ ఎంపీ తేజస్వి మాటలను భూతద్దంలో పెట్టి చూడొద్దని, ఆయన మా ట్లాడిన దాంట్లో అంతరార్థం వేరని, దీనిపై బీఆర్‌ఎస్ అనవసర రాద్దాంతం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మండిపడ్డారు.
పార్లమెంట్‌లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు గురువారం పార్టీ కార్యాలయంలో స్పందించారు. తేజస్వి సూ ర్య వ్యాఖ్యలపై అర్థం పర్థం లేకుండా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని, బీఆర్‌ఎస్ నేతలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వ్యవహరిస్తున్నారని, తేజస్వి తెలంగాణను పాకిస్తాన్‌తో పోల్చలేదని, ఆయన ఉద్దేశం తెలంగాణను కించపరచడం కాదన్నారు.
విభజన సమయంలో జరిగిన అశాస్త్రీయ ధోరణిని లేదా రాజకీయ పరిణామాలను ప్రస్తావించి ఉండొచ్చన్నారు. బీఆర్‌ఎస్ దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ లేకుంటే తెలం గాణ వచ్చేదా?, బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతోనే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పుకునే బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో ఉన్న బలమెంత అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ ఎన్నో సార్లు యూ టర్న్ తీసుకుందన్నారు. రాష్ట్రం కోసం నాడు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వీరందరి ఆత్మహత్యలకు కూడా కాంగ్రెస్ పార్టీనే కారణం కాదా... అన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి చాలా సాఫీగా ఒక్క రక్తం చుక్క పడకుండా మూడు రాష్ట్రాలు ఇచ్చారని, తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్రను బీఆర్‌ఎస్ గుర్తించాలన్నారు.






