ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి: సీపీఐ
మునుగోడు, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేయాలని, తాలు-తేమ పేరుతో రైతులను వేధిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురజా రామచంద్రండిమాండ్ చేశారు.గురువారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. నెల రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కాంటాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ అధికారులు కొనుగోళ్లను ఆలస్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మార్కెట్కు తీసుకువస్తే, తాలు-తేమ పేరుతో కొనుగోలు చేయకుండా నిరాకరించడం అన్యాయమన్నారు. మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.రైతుల నుంచి ధాన్యాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వ మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాస్తారోకో సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ రైతులకు న్యాయం చేస్తామని, కొనుగోళ్లను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ సిపిఐ నాయకులు నిరసన కొనసాగించడంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరసింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, చాపల శ్రీనివాస్, సురిగి చలపతి, గోస్కొండ లింగయ్య, బండమీది యాదయ్య, మందుల పాండు, ఈదులకంటి కైలాస్, కాగితం వెంకన్న, దుబ్బ వెంకన్న, రుమర్తి ముత్తయ్య, తీర్పార్కృష్ణయ్య, కటుకూరి లింగస్వామి, చిరగోని శంకర్, నరసింహ ఉన్నారు.






