గత ప్రభుత్వ ఉనికి లేకుండా చేస్తారా?
- ప్రభుత్వ వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్
- తొలగించటంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం
- దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారికి లేఖ
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైబ్‌సైట్లు, సోషల్ మీడి యా హ్యాండిల్స్‌లో గత ప్రభుత్వానికి సంబ ంధించిన డిజిటల్ సమాచారాన్ని ఉద్దేశ పూర్వకంగా తొలగిస్తున్నారని భారత రాష్ర్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. డిసెంబర్ 2023లో రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు, మీడియా హ్యాండిల్స్‌లో ముఖ్యమైన కంటెంట్, సమాచారం కనబడకుండా పోతోందని ఆరోపించారు.
కొన్ని ముఖ్యమైన వెబ్‌సైట్లను కూడా తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో ఇదంతా మెయింటెనెన్స్ సమస్య అని చెప్పే ప్రయత్నం చేశారని, కొన్ని నెలలుగా సమాచారం కనబడకుండా పోతోన్న ఘటనలు చూస్తుంటే ఉద్దేశపూర్వంకగానే చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. దీని వెనుక రాష్ర్ట ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఉన్నారనే సందేహం కలుగుతోందని అన్నారు.
తెలంగాణకు సంబంధించిన కీలకమైన, అత్యంత ప్రాధాన్యమైన సమాచారా న్ని భవిష్యత్తు తరాలకు తెలియకుండా చేస్తున్న ఈ హేయమైన చర్యను ఆపాలని కోరారు. పబ్లిక్ డొమైన్ నుంచి తొలగించిన కంటెంట్‌ను వెంటనే పునరుద్ధరించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు. కొందరి ఇష్టాయిష్టాల కోసం ప్రజా ఆస్తులను ధ్వంసం చేస్తే తెలంగాణ భవిష్యత్ తరాలు క్షమించవని, వెంటనే ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని సీఎస్ ను కేటీఆర్ కోరారు.
కరువు, కన్నీళ్లుకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం : కేటీఆర్
తలాపున గోదావరి పారుతున్నా తనువంతా ఎడారై ఎండిన శాపానికి విమోచన కాళేశ్వరమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మంగళవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ తెలంగాణ కరువులకు, కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. తెలంగాణ తెర్లయిపోతే సంకలు గుద్దుకుందామని చూపిన వంకరబుద్ధిగాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి, కన్నుకుట్టించిన వరప్రదాయిని అన్నారు. సముద్ర మట్టానికి ఎత్తున ఉన్న మా చేను చెలకలు నదీ జలాలతో తడవాలంటే ఎత్తిపోతల శరణ్యమని తెలిపారు.
దగాపడ్డ నేల దశాబ్దాలుగా జరిపిన గోదారి జలాల సాధన పోరాటలకు సమాధానం కాళేశ్వరమని చెప్పారు. శిథిల శివాలయంగా పాడుబడిపోయిన శ్రీరామ్‌సాగర్‌కు పునరుజ్జీవమిచ్చిన పుణ్యవరం కాళేశ్వరమని, నీళ్లు రాక ఒట్టిపోయిన నిజాంసాగర్‌ను నిండుకుండలా మార్చే అండదండ, మండటెం డల్లో చెరువులను మత్తళ్లు దూకించిన మహత్యం కాళేశ్వరమని పేర్కొన్నారు, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదని తెలియని మీ అజ్ఞానం అని ఎద్దేవాచేశారు. రాజకీయ కుళ్లు కుతంత్రాలను దిష్టి చూపులను తట్టుకోగలం. మీ ఏడుపు మా ఎదుగుదల అని పేర్కొన్నారు.






