10 April, 2026 | 9:25 AM

దేశవాళీ ప్రతిభకు పట్టం

17-12-2025 12:59 AM
  1. కోట్లు కొల్లగొట్టిన అనామక ప్లేయర్లు
  2. కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, అకీబ్ దార్‌లకు జాక్‌పాట్

  3. ప్రశాంత్ వీర్ రూ.14.20 కోట్లు  చెన్నై సూపర్‌కింగ్స్
  4. అకీబ్ నబీ దార్ రూ.8.40 కోట్లు  ఢిల్లీ క్యాపిటల్స్
  5. కార్తీక్ శర్మ రూ.14.20 కోట్లు  చెన్నై సూపర్‌కింగ్స్

అబుదాబీ, డిసెంబర్ 16 : దేశవాళీ క్రికెట్‌లో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్‌కు ఒక వేదికను కల్పించాలన్న ఉద్దేశంతోనే బీసీసీఐ ఐపీఎల్‌ను ప్రారంభించింది.వారికి ఆర్థికపరమైన లబ్ది చేకూరడమే కాదు జాతీయ జట్టులోకి చక్కని రహదారిగా ఉపయోగపడింది. ఈ క్రమంలో చాలామంది ఆటగాళ్లు ఐపీఎల్ వేదికగా సత్తా చాటుతూనే ఉన్నారు. వీరందరూ ఐపీఎల్‌లోకి రావడానికి ప్రధాన మార్గం దేశవాళీ క్రికెట్టే.

ఈ విషయం మరోసారి రుజువైంది. అబుదాబీలో జరిగిన మినీ వేలంలో దేశవాళీ ప్రతిభకు ఫ్రాంచైజీలు పట్టం కట్టాయి. అద్భుతంగా రాణిస్తున్న పలువురు అనామక ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. కేవలం దేశవాళీ టోర్నీలు రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో ప్రదర్శననే పరిగణలోకి తీసుకుని వేలంలో వారిపై కోట్లాది రూపాయలు వెచ్చించాయి. ఈ క్రమంలో నిన్నటి వరకూ ఎవరికీ తెలియని ప్లేయర్స్ రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోయారు.

మినీ వేలంలో భారీ ధర పలికిన అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ జాబితాలో ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మ, అకీబ్ దార్ ఉన్నారు. వీరిలో యూపీకి చెందిన ప్రశాంత్ వీర్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి.20 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా ఫ్రాంచైజీల పోటీతో బిడ్డింగ్ కోట్లాది రూపాయలు వెళ్లింది. జూనియర్ జడేజాగా చెబుతున్న ప్రశాంత్ వీర్‌ను రూ.14.20 కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ దక్కించుకుంది.

దేశవాళీ క్రికెట్‌లో ప్రదర్శనే ప్రశాంత్ వీర్‌కు గుర్తింపు తెచ్చింది. యూపీ టీ20 లీగ్‌లో ఆడుతూ ఫ్రాంచైజీలను ఆకర్షించాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 10 బంతుల్లోనే 37 రన్స్(ఓవరాల్‌గా లీగ్‌లో 112 రన్స్), 9 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇదిలా ఉంటే చెన్నై తీసుకున్న మరో అన్‌క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్‌శర్మ. రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు.

12 మ్యాచ్‌లలో 334 రన్స్ చేయడంతో పాటు కీపర్‌గానూ ఆకట్టుకున్నాడు. ఫినిషర్‌గా భారీ సిక్సర్లు బాదే సామర్థ్యం అతనికి ప్లస్ పాయింట్. అలాగే విజయ్ హజారే ట్రోఫీలోనూ రాజస్థాన్ తరపున 9 మ్యాచ్‌లలో 445 పరుగులు చేసాడు. అందుకే కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై పోటీపడగా.. చివరికి సీఎస్కే రూ.14.20 కోట్లకు దక్కించుకుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్‌కు చెందిన పేస్ ఆల్‌రౌండర్ అకీబ్ నబీ దార్ కూడా రికార్డు ధర పలికాడు. అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో వచ్చిన అకీబ్ దార్ కోసం ఫ్రాంచైజీలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి.

పదునైన పేస్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో పేస్ ఆల్‌రౌండర్ కోసం చూస్తున్న ఫ్రాంచైజీలు అతని కోసం కోట్లు కుమ్మరించాయి. వేలంలో అకీబ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది. దులీప్ ట్రోఫీ చరిత్రలో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన రికార్డ్ అతని సొంతం. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో అకీబ్ దార్ ఎకానమీ బాగుండడంతో భారీ ధర పలికాడు. వీరితో పాటు ఆల్‌రౌండర్ మంగేశ్ యాదవ్ రూ.5.2 కోట్లు(ఆర్సీబీ), తేజస్వి దాహియా మంచి ధర పలికారు.