16-12-2025 11:34:10 PM
ఐపీఎల్-2026 సీజన్ కు ముందు జరిగిన మినీ వేలం(IPL auction) ముగిసింది. ఊహించినట్టుగానే పలు సంచలనాలు వేలంలో నమోదయ్యాయి. మ్యాచ్ విన్నర్లుగా భావించే ఆల్ రౌండర్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. వేలంలో కామెరూన్ గ్రీన్ రికార్డు ధర పలికాడు. ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడిన వేళ గ్రీన్ జాక్ పాట్ కొట్టాడు. ఏకంగా రూ.25.20 కోట్లకు అమ్ముడయ్యాడు. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతన్ని రికార్డు ధరకు కోల్ కత్తా దక్కించుకుంది. దీంతో గ్రీన్ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ రికార్డ్ సృష్టించాడు.
ఇదిలా ఉంటే గ్రీన్ తర్వాత అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్ గా పేసర్ మహేశ్ పతిరణ రెండో స్థానంలో నిలిచాడు. కేకేఆర్ రూ.18 కోట్లకు అతన్ని దక్కించుకుంది. ఇక పతిరణ తర్వాత లివింగ్ స్టోన్ అత్యధిక ధర పలికాడు. తొలి రౌండ్లలో అమ్ముడుపోని లివింగ్ స్టోన్ యాక్సి లేరేటెడ్ రౌండ్ లో జాక్ పాట్ కొట్టాడు. లివింగ్ స్టోన్ ను సన్ రైజర్స్ రూ.13 కోట్లకు దక్కించుకుంది. జోస్ ఇంగ్లీన్ ను లక్నో రూ.8.60 కోట్లకు దక్కించుకోగా.. వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాన్సన్ ను గుజరాత్ టైటాన్స్ రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక విదేశీ ఆటగాళ్లలో మిల్లర్ రూ.2 కోట్లు (ఢిల్లీ), బెన్ డకెట్ రూ.2 కోట్లు (ఢిల్లీ), హనరంగా రూ.2 కోట్లు(లక్నో), డికాక్ రూ.2 కోట్లు (ముంబై), ఫిన్ అలెన్ రూ. 2 కోట్లు (కేకేఆర్), జాకబ్ డఫ్సీ రూ.2 కోట్లకు (ఆర్సీబీ) అమ్ముడయ్యారు.మరోవైపు గత మెగా వేలంలో రికార్డు ధర పలికిన వెంకటేశ్ అయ్యర్ ఈ సారి కేవలం రూ.7 కోట్లకే ఆర్సీబీకి అమ్ముడయ్యాడు. అలాగే స్పిన్నర్ రవి బిష్ణోయ్ ను రూ.7.20 కోట్లకు రాజస్థాన్ దక్కించుకుంది. తొలిరౌండ్లలో అమ్ముడుపోని రాహుల్ చాహర్ ఊహించని విధంగా చివర్లో రూ.5.20 కోట్ల ధర పలికాడు. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ చివర్లో అమ్ముడయ్యారు.