17-12-2025 01:01:07 AM
సిరీస్ అందుకునేందుకు మరొక్క విజయమే మిగిలింది... టెస్టుల్లో చావుదెబ్బ తిని.. వన్డేల్లో రివేంజ్ తీర్చుకున్న టీమిండియా ఇప్పుడు టీ 20 ఫార్మాట్‌లోనూ సిరీస్ గెలుపునకు అడుగుదూరంలో నిలిచింది. రెండో టీ20 ఓటమితో త్వరగానే కోలుకుని మూడో మ్యాచ్‌లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా అదే జోరు కొనసాగిస్తే సిరీస్ విజయం ఖాయం. మరి సమం చేయాలని పట్టుదలగా ఉన్న సఫారీలకు సూర్యభాయ్ సారథ్యంలోని భారత్ ఎలా చెక్ పెడుతుందో.. ?
తుది జట్టులో మార్పులు లేనట్టే
సిరీస్ సమంపై సఫారీల కన్ను
లక్నో, డిసెంబర్ 16 : సౌతాఫ్రికాపై టీ ట్వంటీ సిరీస్ విజయానికి భారత్ చేరువైంది. లక్నో వేదికగా జరగబోయే నాలుగో టీ ట్వం టీలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మూడో మ్యాచ్‌లో పూర్తిగా ఆధిపత్యం కనబరిచిన టీమిండియా అదే జోరు కొనసాగించాలని ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగిపోయారు. సమిష్టిగా రాణించిన పేసర్లు, స్పిన్నర్లు సౌతాఫ్రికా బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వ లేదు.
కెప్టెన్ మార్క్‌క్రమ్ తప్పిస్తే మిగిలిన వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. హర్షి త్ రాణా, అర్షదీప్‌తో పాటు కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కూడా సఫారీలను దెబ్బకొట్టారు. ఇక సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది. వరల్డ్‌కప్‌కు ముందు మ్యాచ్‌ల సంఖ్య తగ్గిపోతూ ఉన్న వేళ భారత కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫామ్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుత సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లోనైనా వీరిద్దరూ ఫామ్ అందుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
సిరీస్ గెలుపుపై కన్నేసిన నేపథ్యంలో నాలుగో టీ20లో విజయా నికి అందరూ కలిసికట్టుగా రాణించాల్సన అవసరం ఉంది. ఇదిలా ఉంటే ప్రపంచకప్‌కు ముందు ఇక ప్రయోగాలకు చెక్ పెట్టాలని పలువురు సూచిస్తుండడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగే అవకాశాలు లేవు. మరోవైపు మూడో టీ20 ఘోరపరాజయం నుంచి కోలుకుంటున్న సౌతాఫ్రికా సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.
గత మ్యాచ్‌లో బ్యాటర్ల వైఫల్యమే ఆ జట్టు ఓటమికి కారణం. మార్క్‌క్రమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడకుంటే కనీసం వంద కూడా చేసేది కాదు. దీంతో ఓపెనర్లు డికాక్, హెండ్రిక్స్‌లపై ఒత్తిడి కనిపిస్తోంది. అలాగే మిల్లర్, బ్రెవిస్ నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌లో ఎంగిడి, యెన్సన్, నోర్జేలపై అంచనాలున్నాయి.
పిచ్ రిపోర్ట్
ధర్మశాలతో పోలిస్తే లక్నోలో మరీ చల్లటి వాతావరణం లేకున్నప్పటకీ వింటర్ కావడంతో టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గుచూపొచ్చు. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావమే మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది.
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(కెప్టెన్) , తిలక్ వర్మ, జితేశ్ శర్మ (కీపర్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్షదీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా
సౌతాఫ్రికా: డికాక్(కీపర్), మార్క్మ్ (కెప్టెన్), స్టబ్స్, బ్రెవిస్, మిల్లర్, ఫెరీరా, మార్కో యెన్సన్, సిపామ్ల,/కార్బిన్ బోస్చ్, కేశవ్ మహారాజ్. , ఎంగిడి, నోర్జే