8 August, 2026 | 4:48 PM

వైద్యసేవలందించేందుకు సిద్ధమైన డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్

08-08-2026 04:00 PM

త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి

హైదరాబాద్: ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Dr MCR TIMS ) సిద్ధంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి పేర్కొన్నారు. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, భద్రత, ఇతర సహాయక వ్యవస్థలను పరిశీలించేందుకు దామోదర్ రాజనర్సింహ శనివారం డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను సందర్శించారు. హాస్పిటల్‌లోని A, B, C బ్లాకులను మంత్రి పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

హాస్పిటల్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి, ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన అన్ని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, హాస్పిటల్‌ను పూర్తిస్థాయి సేవలకు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. హాస్పిటల్‌లో వైద్య సేవల నిర్వహణ, మౌలిక వసతులు, మానవ వనరులు, నాన్‌-మెడికల్ సర్వీసులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఫైర్ సేఫ్టీ, ఇతర వ్యవస్థలపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.