6 May, 2026 | 7:19 PM

కారు నేతలు కరువు!

24-06-2024 12:05 AM
  • అప్పుడప్పుడు మెరుస్తున్న ఒకరిద్దరు
  • అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన సీన్
  • సంక్షోభంలో బీఆర్‌ఎస్ పార్టీ

హనుమకొండ, జూన్ 23 (విజయక్రాంతి) : మొన్నటి వరకు గులాబీపార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతల్లో కొందరు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కనబడకుండా అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మరికొందరు ఎటు వెళ్లారో తెలియని పరిస్థితి. మొత్తంగా బీఆర్‌ఎస్ లీడర్లు ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పలుచబడ్డారనే టాక్ వినిపిస్తోంది. పలు నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించే నేతలే లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పార్టీ జెండా మోసే క్యాడర్ ఉన్నప్పటికీ సమన్వయం చేసే లీడర్లు లేక ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు పార్టీ అధినేత ఒకరిద్దరికే ప్రాధాన్యతనివ్వడం మిగతా వారిలో నైర్యాశ్యం నెలకొంటోంది. ఫలితంగా పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితులకు దగ్గరవుతోంది. ఇంకా ఇలానే ఉంటే మునుముందు పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

లీడర్లు ఎక్కడ..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ లీడర్లు కనిపించడం లేదు. సాధారణ ఎన్నికలకు పూర్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లుగా చెలామణీ అవుతూ మాకు ఎదురులేదని చాటుకున్న లీడర్లంతా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియెజకవర్గాల్లో 11 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ములుగు మినహా జిల్లాల అంతాట వారిదే పెత్తనం.

జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా పనిచేశారు. కానీ, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. 12 అసెంబ్లీ స్థానాలకు 10 నియోజకవర్గాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. స్టేషన్ ఘన్‌పూర్, జనగామ మాత్రమే బీఆర్‌ఎస్ గెలుచుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఓడిపోయిన బీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల తర్వాత నియోజకవర్గాలకు ముఖం చాటేశారు. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయకపోగా.. చూద్దామంటే కనిపించ డం లేదు.

కొందరు ఇళ్లను విడిచి బయటకు రావడం లేదని తెలుస్తోంది. మరికొందరు టూర్ల పేరుతో ఎంచక్కా ఇతర రాష్ట్రాలు, దేశాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైందనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. 

మెరుపుతీగలు!

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖం చాటేసిన లీడర్లు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో అక్కడక్కడ మెరిశారు. నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న నేతలు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వచ్చినప్పుడు తళుక్కున మెరిసి తర్వాత కనిపించకుండా పోయారు.  మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రెడ్యా నాయక్, డాక్టర్ టీ రాజయ్య, మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి సైతం జనాల్లో ఎక్కడా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు.

ఇక వర్థన్నపేటలో బీఆర్‌ఎస్ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీజేపీలో చేరడంతో అక్కడ ఎర్రబెల్లిని ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. కానీ, ఆయన పాలకుర్తిపై దృష్టి పెట్టడంతో వర్థన్నపేటను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో క్యాడర్ గందరగోళంలో పడిపోయిందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్‌ఎస్‌లో ఉంటే రాజకీయ మనుగడ కష్టసాధ్యమని భావిస్తున్న కొందరు నేతలు భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో  ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్ మనుగడ కష్టసాధ్యమనే వాదనలు వినిస్తున్నాయి.