6 May, 2026 | 8:06 PM

Breaking News

చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •   జనగణన 2027పై అవగాహన కార్యక్రమం   •   జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •  

అక్రమ నిర్మాణాలకు అడ్డేది?

24-06-2024 12:04 AM

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

పట్టించుకోని అధికారులు

మున్సిపల్ ఆదాయానికి గండి

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 23: హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలు అత్రికమిస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని లక్ష్మీరెడ్డిపాలెం వద్ద ఎలాంటి అనుమతులు లేకుం డా పెద్ద భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వీటికి మున్సిపాలిటీ నుంచి ఎలాంటి పర్మిషన్లు లేవు. కొందరు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారుల అండ దండలతో ఈ నిర్మాణాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

తద్వారా కోట్ల రూపాయల్లో మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోంది. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణాలు చేపడితే ఏదో చిన్న లోపాన్ని చూపి ఇబ్బందులకు గురిచేసే అధికారులు, అసలు అనుమతులే లేకుండా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి నిర్మాణాలు మున్సిపాలిటీలో కోకొల్లలు. ఈ నిర్మాణాలతో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు భారీగా ముడుపులు దండుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

లక్ష్మీరెడ్డి పాలెంలో కావేరి ఫంక్షన్ హాల్ దగ్గరలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా కమర్షియల్ భవనాన్ని నిర్మిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే ప్రాంతంలో జాతీయ రహదారికి ఆనుకొని షెడ్డు నిర్మిస్తున్నారు. నిర్వాహకులు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ షెడ్డు నిర్మిస్తున్నా అధికారులు అటు వైపు చూడడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

రోడ్లు చిన్నవి.. నిర్మాణాలు పెద్దవి 

మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారంలో గ్రామ పంచాయతీ అనుమతులతో సర్వే నంబర్ 65లోని భూమిని లేఅవుట్ చేసి విక్రయాలు జరిపారు. లేఅవుట్‌లో మొత్తం 20 ఫీట్ల రోడ్లు ఉన్నాయి. లేఅవుట్‌లో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద భవన నిర్మాణాలు సాగుతున్నా అధికారులు చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా చిన్న రోడ్లలో అపార్ట్‌మెంట్ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 

అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా

మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు అనుమతులు ఒకలా తీసుకొని.. నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. జీ+2 అనుమతి తీసుకొని జీ+3 బిల్డింగ్, జీ+3 అనుమతి తీసుకొని జీ+4 భవనాలు ఎలా నిర్మిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సెట్‌బ్యాక్ లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. చిన్న చిన్న రోడ్లలో జీ+3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 

పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయం

పసుమాముల, పెద్ద అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కొన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఇళ్లను కూల్చి పేదలను రోడ్డు పాలు చేశారు. అయితే, భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇవ్వకుండా వారికి సమయం ఇవ్వడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పేదల జోలికి వస్తారు.. పెద్దల జోలికి వెళ్లరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణదారులకు నోటీసుల మీద నోటీసులు ఇచ్చుకుంటూ కాలయాపన చేస్తూ.. ఫైనల్ నోటీసులు ఇచ్చినా వాటిని కూల్చలేదనే విమర్శలు వస్తున్నాయి. 

అధికారుల నిర్లక్ష్యపు సమాధానం..

అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాస్‌ను విజయక్రాంతి ప్రతినిధి ఫోన్‌లో వివరణ కోరగా.. చిన్న చిన్న వాటికి ఏం చెప్పాలంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పేదల ఇళ్ల కూల్చివేతపై అడగగా దాటవేత ధోరణిలో మాట్లాడారు.

అధికారుల అండతోనే.. 

పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. దాదాపు 200 అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ వాటిని తొలగించలేకపోతున్నారు. అధికారులు అక్రమార్కులు కొమ్ముకాస్తూ మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు.  

 ఏర్పుల నర్సింహ, 

సీపీఎం మండల కార్యదర్శి