28 May, 2026 | 12:21 PM

గద్వాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

28-05-2026 11:47 AM

వాహనదారుడిపై సీఐ దురుసు ప్రవర్తన ఆరోపణలు.

గద్వాల టౌన్: గద్వాల పట్టణంలోని సంగాల పార్కు సమీపంలో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వాహనదారులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు నిర్వహించిన తనిఖీలలో చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వాహనదారుడు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడినట్లు సమాచారం. అయితే తన వాహనాన్ని వదిలేయాలని కోరిన ఆ వ్యక్తితో గద్వాల ట్రాఫిక్ సీఐ తీవ్ర ఆగ్రహంతో మాట్లాడినట్లు అక్కడ ఉన్న పలువురు ఆరోపిస్తున్నారు.ఈ

సందర్భంగా సీఐ అసభ్య పదజాలంతో వాహనదారుడిని అవమానించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఇదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కూడా వాహనదారులతో అనుచితంగా ప్రవర్తిస్తూ గట్టిగా మాట్లాడటం ఫోటోలు తీయడం వంటి చర్యలకు పాల్పడినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

పోలీసుల వ్యవహార శైలిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రజల భద్రత కోసం అవసరమే అయినప్పటికీ వాటి అమలులో పోలీసులు మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని వాహనదారులు కోరుతున్నారు.ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.