17 August, 2026 | 1:53 AM

ఆగని మహాలక్ష్మి బస్సు

17-08-2026 01:18 AM
  1. మహాలక్ష్మి మహిళలపై డ్రైవర్లు, కండక్టర్లు చిన్న చూపు
  2. ఎలక్ట్రిక్ బస్సులు పట్టణాలకే పరిమితం
  3. గ్రామీణ ప్రాంతాల వైపు కన్నెత్తి చూడని ఎలక్ట్రిక్ బస్సు
  4. ఇక ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్లు అయితే మహిళమణులకు వెనుక పల్లె వెలుగు బస్సు వస్తుందని ఉచిత సలహాలు
  5. మహాలక్ష్మి లక్ష్యం నెరవేర్చని బస్సు డ్రైవర్లు, కండక్టర్లు
  6. ‘మహిళామణుల ఆర్తనాధనలు వినని డ్రైవర్లు, కండక్టర్లు’
  7. పలు ప్రాంతాల్లో మహిళలు ఉన్నచోట్ల ఆగని బస్సులు

హుజూర్ నగర్, ఆగస్టు16 : రాష్ట్ర ప్రభుత్వం అందించిన మహాలక్ష్మి పథకం మహిళలకు వరంగా మారినా అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే మూడో మహిళా దినోత్సవం నుంచైనా మహిళల కోసం అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచి ఇబ్బందులు తొలగించాలని మహిళలు కోరుతున్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (మహాలక్ష్మి) పథకాన్ని అమలు చేసినా దానికనుగుణంగా బస్సు సర్వీసులు లేక మహిళా మణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నల్లగొండ రీజియన్ పరిధిలోని ఏడు డిపోలు ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నది. నల్లగొండ రీజియన్ పరిధిలోని దేవరకొండ,మిర్యాల గూడ, నల్లగొండ, నార్కట్ పల్లి,యాదగిరి గుట్ట, సూర్యాపేట,కోదాడ డిపోలు ఉన్నాయి.

రీజియన్ వ్యాప్తంగా 750 బస్సులతో పాటుగా  169 ఎలక్ట్రిక్ బస్సులను ప్రజా ప్రభుత్వం నడిపిస్తుంది.దీంతో 919 పైచిలుకు బస్సులు ఉన్నాయి.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో బస్సులు నడిపిస్తున్నా పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచక పోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కొత్త బస్సులను ప్రవేశపెడతామని చెప్పిన ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలు ఎలక్ట్రిక్ బస్సులను మాత్రం తీసుకువచ్చింది.

ఎలక్ట్రిక్ బస్సులు పట్టణాలకే పరిమితమవడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.నల్లగొండ నుంచి మిర్యాలగూడ నుంచి కోదాడ వరకు కోదాడ నుంచి సూర్యాపేట, దేవరకొండ,యాదగిరిగుట్ట రూట్లలో మహిళల రద్దీ తీవ్రంగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ-కోదాడ రూట్లో మహాలక్ష్మి పథకానికంటే ముందే రద్దీ తీవ్రత ఎక్కువగా ఉండేది, మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళల రద్దీ పెరగడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

పలు ప్రాంతాల్లో మహిళలు ఉన్న చోట్ల ఆగని బస్సులు

ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్లలోనే బస్సులు నిండిపోతున్నాయి.ఫ్లాట్ ఫాంలపైకి రాక ముందే బస్సుల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులు హైరానా పడుతున్నారు.ఉన్న కొద్ది పాటి బస్సులతోనే అన్ని రూట్లలో బస్సులు నడిపిస్తున్నా రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు.బస్టాండ్ దాటిన తర్వాత బస్సులు ఎక్కాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోంది.హుజూర్ నగర్,గరిడేపల్లి,నేరేడుచర్ల వివిధ బస్టాప్లలో మహిళలు ఎక్కువగా ఉంటే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని అంటున్నారు.

మహిళలను డ్రైవర్లు,కండక్టర్లు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకునైనా అన్ని రూట్లలో బస్సుల సంఖ్యను పెంచే ప్రకటన చేయాలని మహిళలు కోరుతున్నారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు వినియోగించుకునేలా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కృషి చేయాలని మహిళలు కోరుతున్నారు.

డ్రైవర్లు బస్సులు ఆపడం లేదు

మహిళలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో బస్సులు ఆపడం లేదు. విద్యార్థులు దూరప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది.మహాలక్ష్మి పథకం మహిళలు వినియోగించుకునే విధంగా బస్సులు ఆపాలి.

- పావని, విద్యార్థిని

బస్సుల సంఖ్యను పెంచాలి

పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఎక్కువగా బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నడిపించాలి.కొన్ని బస్సులలో కండక్టర్లు వారి ఇష్టానుసరంగా మాట్లాడుతున్నారు.చాలాచోట్ల బస్సులను ఆర్టీసీ డ్రైవర్లు అస్సలు ఆపడం లేదు.మరి ఎక్స్ ప్రెస్ డ్రైవర్లు అయితే వెనుక పల్లె వెలుగు బస్సు వస్తుంది అది ఎక్కండి అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.

- శాంతి, గృహిణి