మాట నిలబెట్టుకుంటా
- ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా
- సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నా
- ఒకడు రక్తం పంచుకు పుట్టిన సోదరిని ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించాడు
- బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడు
- ఇంకొకరు అఘోరా పూజలు చేస్తున్నాడు
- వీళ్లు తెలంగాణ ఆడబిడ్డలకు మేలు చేస్తారా?
- వారు సెప్టెంబర్‌లో అసెంబ్లీకి రావాలి
- మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
- మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం
- ములుగు కలెక్టరేట్ ప్రారంభోత్సవం
- పరకాలలో బహిరంగ సభకు హాజరు
మహబూబాబాద్/ములుగు, ఆగస్టు 16 (విజయక్రాంతి): ‘మట్టిలో కలిసినా సరే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పనిచేస్తా. హామీలన్నీ నెరవేరుస్తా. గత బీఆర్‌ఎస్ నాయకులు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని చేసి నా చేతిలో పెడితే, కేసీఆర్ చేసిన అప్పులకు నెలకు 7,500 కోట్ల రూపాయలు చెల్లిస్తూ, సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ముం దుకు తీసుకు వెళ్లడానికి రోజుకు 18 గంట లు కష్టపడుతున్నా.
రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా పథకం కింద ఏటా 12 వేల రూపాయలను ఇస్తు న్నా’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. అమ్మవారికి తులాభారంలో బం గారం (బెల్లం) సమర్పించారు. గద్దెల వద్ద దివ్యాంగులు, వితంతు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్ల పంపిణీని ప్రారం భించి పలువురు మహిళలు, దివ్యాంగులకు స్వయంగా పింఛన్లు అందించారు.
మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై వారి ఆర్థిక ప్రగతిని తెలుసు కున్నారు. సమ్మక్క-సారలమ్మ బిడ్డలకు ప్రత్యేకంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్లో అక్కాచెల్లెళ్లకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ములుగు పర్యటన అనంతరం పరకాలకు చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి రూ.484 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
వంద పడకల ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘మా ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలను సారెగా పెట్టాం. ఈ ఏడాది డిసెంబరులో చిలకపచ్చ రంగు చీరలని అందించబోతున్నాం. రక్తం పంచుకుని పుట్టకపోయినా సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నా. ఇంకోవైపు ఒకడు రక్తం పంచుకు పుట్టిన సోదరిని ఆస్తి కోసం ఇంటి నుంచి పంపించారు.
కొడుకుకు బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. వీళ్లు తెలంగాణ ఆడబిడ్డలకు మేలు చేస్తారా? అని సీఎం ప్రశ్నించారు. ఇంకొకరు అఘోరా రావు అఘోరా పూజలు చేస్తున్నాడు. ప్రజలు ఇబ్బందులు పడాలని కోరుకున్నాడు’ అని మాజీ సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కానీ దేవుడు మనవైపు ఉన్నాడని, వర్షాలు కురిపించాడని చెప్పారు.
మల్లూరు నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని, జంపన్న వాగును నూటికి నూరుశాతం అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ‘ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరు. ఆ కష్టాలు తీరాలంటే ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్ష చేసి అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం. ఆదివాసీ బిడ్డలకు సాంకేతిక నైపుణ్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసు కుంటున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలకు రావాలి
‘పదేపదే ప్రతిపక్ష నాయకులు అడుగుతున్నారు. వారు కోరిన మేరకు సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం. అల్లుడు, కొడుకుతోపాటు మామ కూడా అసెంబ్లీ సమావేశాలకు రావాలి’ అని సీఎం సవాల్ చేశారు. వెయ్యిమంది కేసీఆర్లు వచ్చినా ఏం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కేసీఆర్ అనుభవం, సలహాలు మాకు కావాలన్నారు. వారు గత పది సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై వివరించాలన్నారు.
తెలంగాణ ఉద్యమకాలాన్ని గుర్తుచేస్తూ గత పాలకులపై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం వీధి నాటకాలు ఆడితే యువత ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి మళ్లీ వారిని బలి తీసుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంపైనా తీవ్ర విమర్శలు చేశారు.
పదేళ్లు అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అనే ధీమాతో విర్రవీగిన వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పి, 12 అసెంబ్లీ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ర్టంలో అధికారంలోకి రావడానికి వరంగల్ జిల్లా ప్రజలు అండగా నిలిచారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 36 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలో వేసి రైతు పక్షపాతి ప్రభుత్వంగా నిలిచిందన్నారు.
9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసిన చరిత్రతో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని, రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదని ప్రచారం చేశారని, ఉచిత విద్యుత్‌కు 30 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తూ, మూడేళ్లుగా వ్యవసాయ రంగానికి ఉచితంగా నిరంతరాయంగా విద్యుత్ అందిస్తుందని చెప్పారు.
ఇప్పటివరకు ఉచిత విద్యుత్ పథకానికి 1,70,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. గత పాలకులు వరి చేస్తే ఉరి వేసుకోవాల్సిందేనని చెప్పారని, వ్యవసాయం దండగ అన్న రీతి నుంచి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవసాయాన్ని పండగగా మార్చిందన్నారు. వరి వేసుకోవాలని, సన్న ధాన్యం పండిస్తే 500 రూపాయలు బోనస్ గా ఇచ్చి ప్రోత్సాహకంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచిందన్నారు.
‘పీసీసీ అధ్యక్షుడిగా సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ములుగు నుంచే పాదయాత్ర మొదలు పెట్టాం. రాష్ట్ర నలుమూలలా ప్రతీ గూడేనికి, పల్లెకు వెళ్లి సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చాం. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. సీతక్క మీ సమస్యల్ని పరిష్కరిస్తోంది. మేడారం సమ్మక్క సారక్క ప్రాంగణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీలు కట్టడానికే రాష్ట్ర ఆదాయంలో పెద్ద మొత్తం ఖర్చవుతోందని, రూ.75 వేల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతున్నామని అన్నారు. గత పాలనలో బోల్తాపడిన రాష్ట్ర బండిని మళ్లీ పట్టాలెక్కించి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
యువతకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు
ఆడబిడ్డలు, పేదలు, నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని సీఎం అన్నారు. ‘నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి సారించండి. 12 వ తరగతి తరువాత నైపుణ్య విద్యపై దృష్టి సారించండి. నైపుణ్యం ఉంటే జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో అనేక అవకాశాలు ఉన్నాయి’ అని సీఎం అన్నారు. ములుగు జిల్లా యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నిరుద్యోగ యువతకు జర్మన్, జపనీస్, కొరియన్ భాషల్లో ఉచిత శిక్షణ అందిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత రాజకీయ ప్రచారాలకు లోనుకావద్దని సీఎం సూచించారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం.. గత సర్కార్ చేసిన మాటలు నమ్మి మోసపోవద్దు అని అన్నారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్ని విడతల వారీగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, కానిస్టేబుల్ పోస్టులకు కూడా విడతలవారీగా నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యత తమదేనన్నారు.
కాంగ్రెస్‌తోనే సోషల్ జస్టిస్
కేసీఆర్ పాలన కేవలం తన కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన ఫ్యామిలీ జస్టిస్ అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసే సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తోందని సీఎం అన్నారు. కేసీఆర్ సీఎం అయితే ఒక్క కుటుంబానికే ప్రయోజనం జరుగుతుందని, తాను సీఎం అయితే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో ఎవరికి పదవులు దక్కాయి.. తమ పాలనలో ఎవరికి హోదాలు లభించాయో ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు.
ఆయా కార్యక్రమాల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్, విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్‌రెడ్డి, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మురళి నాయక్, యశ్వసిని తదితరులు పాల్గొన్నారు.






