1 July, 2026 | 2:20 AM

మెట్టపంటలే మేలు

01-07-2026 01:35 AM

ఎల్ నినో వల్ల తక్కువ వర్షాలు పడుతాయి.. అందుకే రైతులు పంట మార్పిడి చేయాలి

వానాకాలం రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

  1. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నాం
  2. కేసీఆర్ ప్రజలకు ఏం చేశారు? 
  3. ఊరూరా తాగుడు కల్చర్ తెచ్చిండు
  4. కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టిండు 
  5. పదేళ్ల కేసీఆర్, 12 ఏళ్ల మోదీ, మా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?
  6. విపక్షాలు పొర్లుదండాలు పెట్టినా మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ ఆగదని స్పష్టీకరణ

* నేను అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకోలేదు. కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూ ప్రజల మధ్యనే తిరుగుతున్న. మేం రైతుబజార్లు తెస్తే, కేసీఆర్ బెల్ట్ బజార్లు తీసుకొచ్చిండు. వేల కోట్ల కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు. కేసీఆర్ మళ్లీవస్తే భార్యాభర్తల  ఫోన్లు  వింటాడు తప్ప ఏమీ చేయడు. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. పదేళ్ల బీఆర్‌ఎస్, పన్నెండేళ్ల మోదీ పాలన, రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా?

* 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నాం. సేద్యానికి కరెంట్ సమస్య ఉండదు. ప్రతి సీజన్‌లోనూ సాగు పనులు మొదలయ్యేలోపు రైతులకు రైతుభరోసా అందిస్తున్నాం. ఈసారి కూడా ౯ రోజుల్లోనే జమచేస్తాం. ఇందుకు రూ.9 వేల కోట్లు సిద్ధంచేశాం. రైతుల శ్రేయస్సు దృష్ట్యా పంట మార్పిడి చేయాలని చెబుతుంటే కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నరు. కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో వరి పండించాడా? గంజాయి పండించాడా?

 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : ‘అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. అందు కోసం రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగలా మారుస్తున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ఏడు ఎల్‌నినో వల్ల వర్షాలు తక్కువగా పడుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే పంటలు మార్చాలని చెబుతున్నాం అని స్పష్టం చేశారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా పంట మార్పిడి చేయాలని చెబుతుంటే దానిపై కూడా కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ దోపిడీ లేకుండా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఆరోపించారు. సంసారాన్ని సర్దుకుపోతున్నామని, బజారున పెట్టుకోవద్దని చూస్తున్నామని  తెలిపారు. వందల మంది త్యాగాలు చేస్తే పదవులు వచ్చాయని, ఇవాల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రజా పాలన.. కాదా అని  ప్రశ్నించారు. తమను అధికారంలోం చి దిగిపో అంటున్నారని.. ఇదేమన్నా మీ గడీనా అంటూ.. సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వానాకాలం రైతుభరోసా నిధులును డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్కతో కలిసి శిల్పకళా వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు.  తొలి రోజు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2482.02 కోట్లు జమ కానున్నాయి. ఒక ఎకరం వరకు 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు విడుదల చేశారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..  గత 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 19 మంది ముఖ్యమంత్రులు పాలించారని, 19 మంది సీఎంలు చేసిన అప్పు రూ.60వేల కోట్లు మాత్రమేనన్నారు. కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ చేసిన అప్పు రూ.8.11 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. రూ.8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలో మునిగిన తెలంగాణ రాష్ట్రాన్ని తనకు అప్పగించారని రేవంత్ రెడ్డి అన్నారు. 9 రోజుల్లోనే రూ. 9 వేల కోట్లు  రైతుభరోసా కింద చెల్లిస్తాం.. నగదు సిద్ధం చేశాం.. అని వెల్లడించారు.

బకాయిలు పెట్టింది బకాసురులు.. కట్టే పని మాత్రం నాకు పడింది

ఎన్నికల ముందు రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్ల అప్పు ఉంటుందని భావించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక లెక్కలు తీస్తే.. గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయని కామెంట్ చేశారు. 2023లో సీఎస్ వంటి ఐఏఎస్‌లకే ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేదన్నారు. మిగతా ఉద్యోగులకు వాయిదా పద్ధతుల్లో వచ్చేయన్నారు. బడి పిల్లల తిండి బిల్లులు, స్వయం సహాయక సంఘాలకు వంట బిల్లులు ఇవ్వలేదన్నారు.

హాస్టల్ విద్యార్థులకు మైస్, కాస్మొటిక్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ. 8 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారని పేర్కొన్నారు. సర్పంచ్‌లకు వందల కోట్లు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. ‘బకాయిలు పెట్టింది బకాసురులు.. కట్టే పని మాత్రం తనకు పడిందన్నారు. ఇనుప కంచెలు వేసుకుని నేను లోపల లేను. గద్దరన్న ప్రగతిభవన్‌కు పోతే ఎండలో నాలుగు గంటలు కూర్చోబెట్టాడు. షేర్వానీ వేసుకుని నవాబు అని చెప్పుకోలేం.. మనం నవాబులం కాదు బీకార్లం.. అని అన్నారు.  

అప్పులు చేసిన ఫామ్‌హౌస్‌లో పండలే..

నేను అప్పులు చేసి ఫామ్‌హౌస్‌లో పడుకుని.. తప్పించుకుం తిరగట్లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీరుస్తూ.. ప్రజల మధ్యే ధైర్యంగా తిరుగుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ చేశామన్నారు. రుణమాఫీ కింద ఆరు నెలల్లోనే రైతుల ఖాతాల్లో రూ.22,600 కోట్లు జమ చేశామని తెలిపారు. రైతు భరోసా కింద ప్రభుత్వం రాగానే రూ. 7 వేల కోట్లు  చెల్లించాం.

సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లో బకాయిలు పెట్టిపోతే 2023 లో చెల్లించాం. రైతుభరోసాను 12 వేలకు పెంచి ఇప్పటి వరకు 27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. ఈ విడుతతో కలిసి  36 వేల కోట్ల రైతు భరోసా కింద చెల్లించాం.  రాష్ట్రంలో రైతులకు కేవలం ఉచిత కరెంట్ కోసం రూ.36 వేల కోట్లు చెల్లించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ పరికరాలకు ఏటా వెయ్యి కోటు,  రైతుబీమాకు ఏటా రూ.3,500 చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. 

కాంగ్రెస్ వస్తే.. కరెంట్ ఉండదని దుష్ప్రచారం చేశారని, సాగుకు ఉచిత కరెంట్ అనేది కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని  సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వేల కోట్ల కమీషన్ల కోసమే హడావుడిగా కాళేశ్వరం కట్టారని కామెంట్ చేశారు.  కూలిన కాళేశ్వరం నుంచి మూడేళ్లుగా చుక్కనీరు తీసుకోలేదని.. ఇవాళ వరిసాగులో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని అన్నారు.

మేం రైతుబజార్లు తెస్తే.. కేసీఆర్ బెల్ట్ బజార్లు తెచ్చాడు

చిన్న రాక్షసులు బయలుదేరి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించి సీఎం రేవంత్ విమర్శలు చేశారు.  ప్రజలకు ఏం చేశారని కేసీఆర్ మళ్లీ రావాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. రైతు రుణమాఫీని పూర్తి చేశారా, దళితులకు మూడెకరాల భూమి ఇచ్చారా, నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా? అని ఫైర్ అయ్యారు. ఊరూరికి మాత్రం బెల్ట్ షాపులు ఇచ్చి తాగుడు కల్చర్ తెచ్చిండని మండిపడ్డారు. మేం రైతుబజార్లు తెస్తే కేసీఆర్ బెల్ట్ బజార్లు తెచ్చాడని, పిల్లలను కూడా  తాగుబోతులను చేశాడని దుయ్యబట్టారు. 

కాళేశ్వరంపై కాశీమజిలీ కథలు ఇంకెంతకాలం.. 

కాళేశ్వరంపై కాశీమజిలీ కథలు ఇంకెంత కాలం చెబుతారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నష్టాల్లో కొట్టుమిట్టాడిన ఆర్టీసీ నేడు వెయ్యి కోట్ల లాభంతో నడుస్తోందని అన్నారు.  ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం.. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వద్దని ఆటో వాళ్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. 1000 బస్సులకు మహిళా సంఘాలను యజమానులను చేశాం.

స్వయం సహాయక మహిళలతో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను పెట్టించాం. సింగరేణి, విద్యుత్ శాఖలో భారీ సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు. రిలయెన్స్‌తో పోటీ పడేలా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. స్వయం సహాయక మహిళల స్టాల్స్ కోసం 1000 కోట్ల  విలువ చేసే స్థలాన్ని శిల్పారామంలో కేటాయించాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నామని సీఎం చెప్పారు. 

బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు..

పదేళ్ల బీఆర్‌ఎస్, 12 ఏళ్ల మోడీ పాలన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడానికి 15 ఏళ్లు పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు వేస్తానని, ఏడాదికి  2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాననని చెప్పిన మోదీ చెప్పారని గుర్తు చేశారు. 

పన్నెండేళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చాయా?  తెలంగాణలో బండి సంజయ్, కిషన్‌రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అంటున్నాడు.. తెలంగాణలో ఆటలు సాగవన్నారు.  తాను ఉన్నది ఉన్నట్లుగా చెబుతానని, తనకు పదవి శాశ్వతం కాదన్నారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్‌లకే పదవులు శాశ్వతం కాలేదు.. అబద్దాలు చెప్పి నమ్మించనని స్పష్టం చేశారు.

ఫామ్ హౌస్  పశుపతిని బంధించాను.. 

ఫామ్‌హౌస్‌లో పశుపతిని బంధించాను.. అరుంధతి సినిమాలో రాక్షసుడిలా ఫామ్‌హౌస్‌లో రైతులు బంధించారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణ కోసం యా శ్రీకాంతచారి, యాదయ్య, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కేసీఆర్ తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు మేం 30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ఉద్యోగులకు  మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామన్నారు. 

ఫాంహౌస్‌లో వరి పండించాడా, గంజాయా?

వరి వేసుకుంటే ఉరే అన్న కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో వరి పండించి క్వింటాకు రూ. 4,200 చొప్పున అమ్ముకున్నాడని దుయ్యబట్టారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో వరి పండించాడా? గంజాయి పండించాడా? అని ఆరోపించారు.  దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. తెలంగాణ నీ అయ్య జాగీరా, నీ తాత గడీలు అనుకుంటున్నవా?  గడీల ముందు బానిసలమా?  రాజీనామా చేయడానికి అని సీఎం రేవంత్‌రెడ్డి హరీష్‌రావుపై ఫైర్ అయ్యారు.

కేసీఆర్ మళ్లీ వస్తే భార్యభర్తల ఫోన్లు వింటాడు తప్ప ఏమీ చేయడన్నారు. నేను, నా భర్త మాట్లాడుకుంటుండగా విన్నారని సొంత బిడ్డ కూడా చెప్పింది.. ఎందుకు ఆ బతుకు అని మండిపడ్డారు. నిజం చెప్పితే తలకాయ వెయ్యి వక్కలు అవుతుందన్న శాపం కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నట్లుంది,ఒకరికి మించి ఒకరు అబద్దాలు చెపుతున్నారు.. కేసీఆర్‌ను మించి అబద్దాలు చెబుతున్నారు..  బుద్ది మారనంత వరకు దేవుడు వాళ్లను క్షమించరు ’ అని హెచ్చరించారు. 

మేం ఇచ్చిన చీరలను ఆడబిడ్డలు మెచ్చారు

బతుకమ్మ చీరలను జొన్న చేను కాడ పిట్టలు కొట్టడానికి కట్టారు. మేం పెట్టిన చీరలను ఆడబిడ్డలు సంతోషంగా కట్టుకుంటున్నారు.  ఈ ప్రభుత్వం మీది.. ఈ ప్రభుత్వం ప్రజలది.. ప్రభుత్వం రైతులది, ఆడబిడ్డలది, నిరుద్యోగులది. 5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ ఇస్తామంటే వద్దని అంటున్నారు. మూసీ వద్దని, మెట్రో వద్దని, రీజనల్ రింగ్ రోడ్డు వద్దని అంటున్నారు. పొర్లు దండాలు పెట్టినా అన్ని పనులు పూర్తి చేస్తానన్నారు. కేసీఆర్ లాంటి తప్పుడు పనులు మేం చేయం. ఏమి చేసినా చేయకపోయినా భార్యభర్తలు మాట్లాడుకుంటే మాత్రం వినం ’ అని సీఎం తెలిపారు.  

ధాన్యం ఉత్పత్తి, సేకరణలో మనమే టాప్: మంత్రి తుమ్మల 

తెలంగాణను గత ప్రభుత్వం అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి, విధ్వంసం చేసిందని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షలలోపు రైతు రుణాలను మాఫీ చేశామని మంత్రి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తి, ధాన్యం సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఆయిల్పామ్ సాగులో కూడా తెలంగాణను దేశంలో నంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.-

రైతు సంక్షేమమే లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

రైతు సంక్షేమ లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించి, అప్పుల ఊబిలోకి నెట్టిన మాజీ పాలకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్రంపై బావ, బామ్మర్దులు (కేటీఆర్, హరీశ్‌రావు) అడ్డగోలుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని రైతాంగం తిప్పికొట్టాలన్నారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

గత ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం కేవలం రూ.2,88,670 కోట్ల మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నర ఏళ్లలోనే రూ.1,56,496 కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిందని వివరించారు. అంటే నెలకు రూ.  5,217 కోట్ల చొప్పున, ఏడాదికి రూ. 62,604 కోట్లు  రైతు సంక్షేమం కోసం వెచ్చిస్తున్నామని భట్టి వివరించారు. రైతు రుణమాఫీ చేసిన తరహాలోనే సన్న వడ్లకు బోనస్, రైతు భరోసాను నిరంతరాయంగా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రైతు భరోసా రైతాంగానికి కానుక: మంత్రి ఉత్తమ్ 

తెలంగాణ రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం అమలు చేస్తోందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.  ఈ రోజు నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తున్నామని ప్రకటించారు.  రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని... రైతు నవ్వితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్న నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి రైతు హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం ఇదేనని, ఖరీఫ్ సీజన్ నుంచే జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏడు రకాల సన్న వడ్లకు బోనస్ అందిస్తామన్నారు. రైతు పండించిన ప్రతి గింజకు విలువ పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే ధాన్యం ఉత్పత్తి, ధాన్యం కొనుగోలు రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 

రైతు అనుకూల విధానాలు, సకాలంలో ధాన్యం కొనుగోలు, వేగంగా రైతుల ఖాతాల్లో చెల్లింపులు, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి లభ్యత వంటి చర్యలతో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  పేర్కొన్నారు.  రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామని, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి రైతు సంక్షేమ కార్యక్రమాల కోసం రూ.80 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామన్నారు. దేశంలోనే రైతు సంక్షేమంపై అత్యధిక పెట్టుబడి పెట్టిన ప్రభుత్వాల్లో తెలంగాణ ఉన్నదన్నారు.