ఎక్సైజ్ సిబ్బంది విధులు భేష్
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (విజయక్రాంతి): ఎన్నికల వేళ రికార్డు స్థాయిలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం స్వాధీనం చేసుకున్నామని, తమ సిబ్బంది నిర్వహించిన విధులు భేష్ అని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అన్నారు. ఎన్నికలు అదునుగా భావించి పలువురు అక్ర మార్కులు నాన్‌డ్యూటీ లిక్కర్, గంజాయి, మత్తుమందును తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు స్వాధీనం చేసుకు న్నట్లు బుధవారం ఓ ప్రకటనలో చెప్పారు. గోవా నుంచి విశాఖపట్టణానికి తరలిస్తున్న నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని మహబూబ్‌నగర్ జిల్లా బాలనగర్ ప్రాంతంలో పట్టుకు న్నామని, దాని విలువ రూ.2.07 కోట్లు ఉంటుందని చెప్పారు.
అదే విధంగా వికారాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, భద్రాచలం ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వేళ పట్టుకున్న నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా దూలపల్లి శివారులో జగదాంబ కెమికల్స్ పేరిట నిర్వహిస్తున్న ఓ కంపెనీలో రెక్టిఫైట్ స్పిరిట్‌ను పట్టుకున్నారని, దాని విలువ రూ. 2.31 కోట్లు ఉంటుందని చెప్పారు. అలాగే రాజస్థాన్ నుంచి శంషాబాద్, బాబుల్‌రెడ్డినగర్, కాటేదాన్‌కు తీసుకువచ్చిన నల్ల మందును, గుట్కాల తయారీలో ఉపయోగించే మూలికలను, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారని, వాటి విలువ రూ.1.73 కోట్లు ఉంటుందని చెప్పారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఓ కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు.




