28 February, 2026 | 5:16 PM

కోల్‌కతాలో భూకంపం

28-02-2026 02:10 AM

రిక్టార్ స్కేల్‌పై 4.9 తీవ్రత నమోదు

భయభ్రాంతులకు గురైన ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు

కోల్‌కతా, ఫిబ్రవరి 27: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో భూకంపం సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం భూమి కంపించడంతో ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఇళ్లు, ఆఫీసులు, పాఠశాలల నుంచి బయటికి పరుగులు తీశారు. వారంతా బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడారు. కోల్‌కతాలోని ఒక సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కూడా భూకంపాన్ని గమనించారు.

ఈ సభలో వస్తువులు, ఇళ్లలోని కర్చీలు, ఫ్యాన్లు కూడా కంపిచాయి. మధ్యాహ్నం 1:22 గంటల ప్రాంతంలో సుమారు 45 సెకన్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఈ భూకంపానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోల్కతా మాత్రమే కాకుండా హౌరా, హుగ్లీ, సుందర్బన్స్ ప్రాంతాలు కూడా భూకంప ప్రభావానికి గురయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.

భూకంపాలను ట్రాక్ చేసే భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు నైరుతి దిశలో 191 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది మధ్యాహ్నం 1.22 గంటలకు భూమి ఉపరితలం నుంచి 10 కి.మీ లోతులో నమోదైంది. భూకంప కేంద్రం కోల్‌కతా నుంచి 100 కి.మీ దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌లోని నయాబజార్‌లో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.