19 April, 2026 | 2:18 AM

మహిళా డెయిరీ ఏర్పాటుతో ఆర్థికాభివృద్ధి..

13-05-2025 07:49 PM

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి..

హనుమకొండ (విజయక్రాంతి): పరకాల నియోజకవర్గంలోని దామెరలో మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు మహిళా డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాష్ రెడ్డి(MLA Revuri Prakash Reddy) అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ మహిళా సొసైటీలో పరకాల నియోజకవర్గంలోని మహిళా రైతులకు శిక్షణ కార్యక్రమానికి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య(Collector P. Pravinya), డాక్టర్ సత్య శారద, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముల్కనూర్ సొసైటీ ద్వారా పాడి రంగంలో మహిళలు ఏ విధంగా పురోభివృద్ధి సాధిస్తున్నారనే వివరాలను నిర్వాహకులను ఎమ్మెల్యే, కలెక్టర్లు అడిగి తెలుసుకున్నారు.

మహిళా రైతులకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను గురించి సొసైటీ నిర్వాహకులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ... మహిళా డెయిరీ గురించి తెలుపుతూ 6 మండలాలలోని మహిళా రైతులతో డెయిరీని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇందుకుగాను 53 కోఆపరేటివ్ సంఘాలను రిజిస్ట్రేషన్ చేయించినట్లు పేర్కొన్నారు. ఏర్పాటు చేయనున్న డెయిరీని నిర్వహించే విధంగా పాల డెయిరీని గత కొన్నేళ్లుగా స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు డెయిరీ ద్వారా శిక్షణ ఇస్తునట్లు పేర్కొన్నారు.

త్వరలో దామెర మండలంలో డెయిరీ ఏర్పాటు చేస్తునట్టు తెలిపారు. మహిళా రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పాల డెయిరీ ద్వారా కల్తీ లేని స్వచ్ఛమైన పాలు సరఫరా చేయడం, మహిళలని వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. డెయిరీ ఏర్పాటు ద్వారా మహిళల ఉపాధి కల్పనకు సాధ్యమవుతుందని తెలిపారు. 6 మండలాలలో పాడి పశువుల సర్వే, పాల దిగుబడుల సర్వే పూర్తయినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, ఇతర అధికారులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.