విద్యాసంస్థల బంద్ విజయవంతం
చేవెళ్ల / మొయినాబాద్జులై 24(విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడులను నిరసిస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం చేవె ళ్ల, మొయినాబాద్ మండలాల్లో విద్యాసంస్థల బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా ముగిసింది.
బంద్ను పురస్కరించుకుని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్ యుఐ, పిడిఎస్యు నాయకులు, విద్యార్థులు పాల్గొని నిరసన తెలియజేశారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్ కేసర్, జూలై 24 (విజయక్రాంతి) : ఎన్ ఎస్ యూ ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి పిలుపు మేరకు శుక్రవారం విద్యాసంస్థల బంద్ విజయవంతం చేసినట్లు మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ నాయక్ తెలిపారు. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా తెలంగాణలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ప్రజాస్వామ్యవాదులు ఈ బంద్కు పూర్తి మద్దతు తెలపారని పేర్కొన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసి ఎదులాబాద్ డివిజన్ అధ్యక్షుడు సామల అమరేందర్ , విశ్వనాథం, ఉదయ్ కుమార్ రెడ్డి, సామల నవీన్, వాలుక లక్ష్మయ్య, కృష్ణ, మని శరణ్, ప్రసాద్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.






