25 July, 2026 | 2:16 AM

సింగరేణి ప్రయోజనాలే ముఖ్యం

25-07-2026 01:38 AM
  1. కొత్త బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణ
  2. రాష్ట్ర విద్యుత్ రంగానికి సింగరేణి వెన్నెముక
  3. సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం
  4. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  5. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, మణుగూరు పీకే ఓసీ ఓపెన్‌కాస్ట్ గని సందర్శన
  6. భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో డీఏవీ స్కూల్ ప్రారంభం 

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 24 (విజయక్రాంతి): సింగరేణి ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, కొత్త బొగ్గు బ్లాకుల సాధనకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో విస్తృతంగా పర్యటించారు. మణుగూరు లోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పత్తి కార్యకలాపాలను పరిశీ లించారు.

అనంతరం, మణుగూరు ప్రకాశ్ ఖని (పీకే ఓసీ) ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనిని సందర్శించారు. గని పనితీరు, బొగ్గు ఉత్పత్తి, నాణ్యత, సంస్థ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్), తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీఎస్జెన్కో) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిం చారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేసిన డిఏవి పాఠశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను కాపాడుకోవడం, లాభాల బాటలో నడిపించడం, పోటీ ప్రపంచంలో మరిం త బలోపేతం చేయడం, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, యాజమాన్యం అందరి ఉమ్మడి బాధ్యత అని అన్నారు. సింగరేణి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, సంస్థ భవిష్యత్తుకు అవసరమైన ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశా రు.

తెలంగాణకు సింగరేణి ఆత్మవంటిదని, 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థను కాలానుగుణంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఒకప్పుడు బొగ్గు ఉత్పత్తి రంగంలో సింగరేణిదే ఏకఛత్రాధిపత్యమని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల బహిరంగ వేలం విధానాన్ని అమలు చేయడంతో అనేక ప్రైవేట్ సంస్థలు రంగంలోకి వచ్చి పోటీ తీవ్రంగా పెరిగిందన్నారు.

ఈ పరిస్థితుల్లో నాణ్యత, ఉత్పాదకత, ఆధునిక సాంకేతికత, వ్యయ నియంత్రణ ద్వారా పోటీతత్వాన్ని పెంచుకుంటేనే సింగరేణి భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ దేశంలో అత్యంత బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నప్పటికీ పెరుగుతున్న పోటీని సమర్థంగా ఎదుర్కోలేక వెనుకబడిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి పరిస్థితి సింగరేణికి రాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. 

బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలి

జెన్కోతో పాటు ఇతర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సరఫరా చేసే బొగ్గు అత్యున్నత నాణ్యతతో ఉండాలని స్పష్టం చేశారు.  గ్రేడ్-4, గ్రేడ్-5, గ్రేడ్-6 ప్రమాణాల ప్రకారం బొగ్గును శాస్త్రీయంగా బ్లెండింగ్ చేసి సరఫరా చేయడం ద్వారా వినియోగదారుల విశ్వాసం పెరుగుతుందని, మార్కెట్లో సింగరేణి ప్రత్యేకత మరింత పెరుగుతుందని తెలిపారు. సింగరేణి లాభాల్లో ఉంటేనే వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉంటుందని పేర్కొన్నారు.

సంస్థను లాభాల బాటలో నడిపించడం ప్రతి అధికారి, ఉద్యోగి, కార్మికుడి బాధ్యత అని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో కొత్త బొగ్గు బ్లాకుల అభివృద్ధిలో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని, యాదాద్రి, భద్రాద్రి తదితర థర్మల్ విద్యుత్ కేంద్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు బ్లాకులను గుర్తించి వేగంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

రాబోయే 15 నుంచి 20 ఏళ్లలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా థర్మల్ పవర్, సోలార్, పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కూడా విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇకపై సింగరేణి బోర్డు సమావేశాలు కేవలం పరిపాలనా అంశాలకు పరిమితం కాకుండా సంస్థ విస్తరణ, పెట్టుబడులు, సాంకేతిక ఆధునికీకరణ, రాబోయే పదేళ్ల అభివృద్ధి వ్యూహంపై చర్చించే వేదికగా మారాలని సూచించారు.

ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో సింగరేణి సంస్థ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మాలోత్ రాందాస్ నాయక్, ఎస్సీసీఎల్ చైర్మన్ అండ్ ఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ఐఏఎస్, టీఎస్జెన్కో చైర్మన్ అండ్ ఎండీ హరీష్ ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.