25 July, 2026 | 2:46 AM

కాళేశ్వరంపై కేంద్రానికి సమగ్ర నివేదిక

25-07-2026 02:03 AM
  1. ఎన్‌డీఏ సూచనల మేరకే ‘ఫ్రీ ఫ్లో మోడ్’ అమలు
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  3. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష    

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహిం చిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకే మూడు బరాజ్‌లను ప్రస్తుతం ఫ్రీ- (నీరు నిల్వ లేకుండా) ఫ్లో విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు పంపే నివేదికలో ఎన్డీఎస్‌ఏ సూచనలు, కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) నివేదికలు, జీపీఆర్ (గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్) పరీక్షల ఫలితాలు, రాఫ్ట్ ఫౌండేషన్ కింద గుర్తించిన ఖాళీల వివరాలు, ఫొటోలు, ఇతర సాంకేతిక ఆధారాలను జతచేయాలని అధికారులను ఆదేశించారు. బ్యారే జీలను నీటి నిల్వ, పంపింగ్‌కు ఎందుకు వినియోగించడం లేదన్న అంశాన్ని పూర్తి సాంకేతి క ఆధారాలతో కేంద్రానికి వివరించాలన్నారు. 

‘అన్నారం’లోనూ సమస్యలు

 బరాజ్‌ల పునరుద్ధరణ పనులపై జరిగిన సమీక్షలో అధికారులు పలు కీలక అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్జ్ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) తాజా జీపీఆర్ పరీక్షలు, ఇతర సాంకేతిక సమాచారం విశ్లేషణను తుది దశకు తీసుకెళ్లిందని తెలిపారు. అన్నారం బ్యారేజీ రాఫ్ట్ ఫౌండేషన్ కింద కూడా ఖాళీలు ఉన్నట్లు సూచించే సాంకేతిక ఆధారాలు లభించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ నీటి నిల్వ సురక్షితం కాదని తెలిపారు.

మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఆగస్టు నెలాఖరులోగా సిద్ధమవుతుందని, సెప్టెంబర్ మధ్య నాటికి ప్రాథమిక వ్యయ అంచనాలు రూపొందిస్తామని అధికారులు మంత్రికి వివరించారు. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు సంబంధించిన అదనపు సాంకేతిక విశ్లేషణలు రెండు వారాల్లో పూర్తవుతాయన్నారు.