అధ్యాపకులకు నిరంతర అభ్యాసం అవసరం : కేయూ వీసీ ప్రొ. కె.ప్రతాపరెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): ఆధునిక సాంకేతిక పరిణామాలతో ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యా రంగం(Education) కూడా విస్తృత మార్పులను అనుభవిస్తున్నదని, అలాంటి పరిస్థితుల్లో అధ్యాపకులు తమ బోధనా, పరిశోధనా విధానాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం అవసరమని కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కర్నాటి ప్రతాపరెడ్డి(Prof. K. Pratap Reddy) అన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతిక పరిణామాలను అవగాహన చేసుకొని ప్రపంచ స్థాయి పోటీలో నిలవాలంటే ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకునే దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు.
సోమవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(College of Arts and Science) రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “బోధనా విధానాలు, ప్రయోగశాల నిర్వహణలో గ్రీన్ సస్టైనబుల్ కెమిస్ట్రీ ఆవిష్కరణలు” అనే అంశంపై నిర్వహిస్తున్న 5 రోజుల ఉపాధ్యాయ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో అమలవుతున్న జాతీయ విద్యా విధానం–2020 లక్ష్యాలను సాధించాలంటే అధ్యాపకులు తమ బోధనలో నూతనతను తీసుకురావాల్సిన అవసరం ఉందని వివరించారు.ఈ కార్యక్రమంలో కీలక ఉపన్యాసం చేసిన అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్ర రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యా వ్యవస్థలో కొత్త బోధనా పద్ధతులు ప్రవేశిస్తున్నాయని తెలిపారు.
డిగ్రీ, పీజీ స్థాయిలో బోధన నిర్వహిస్తున్న అధ్యాపకులకు ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచడంలో దోహదపడతాయని అన్నారు.తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షులు డాక్టర్ మోహన్ రావు, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సంజీవరెడ్డి, ట్రెజరర్ ప్రొఫెసర్ ఎస్.ఎం. రెడ్డి కూడా శాస్త్ర విజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అధ్యాపకులు తాజా పరిణామాలను తెలుసుకుంటూ బోధనలో కొత్త పద్ధతులను అనుసరించాలని సూచించారు.ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు డైరెక్టర్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి మాట్లాడుతూ 5 రోజులపాటు జరిగే ఈ ఉపాధ్యాయ అభివృద్ధి కార్యక్రమంలో ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ సాంకేతిక వినియోగం, పరిశోధనా దృక్పథం అభివృద్ధి వంటి అంశాలపై నిపుణులు ఉపన్యాసాలు ఇస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ హనుమంతు, ప్రొఫెసర్ వాసుదేవ రెడ్డి, రసాయన శాస్త్ర విభాగం పూర్వాచార్యులు శ్రీహరి, జగన్నాథ స్వామి, ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన డిగ్రీ, పీజీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




