14 May, 2026 | 3:57 AM

రవాణా సౌకర్యం మెరుగుపరిచేందుకు కృషి

14-05-2026 02:48 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 13 (విజయ క్రాంతి): ప్రజలకు సురక్షితమైన, మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్‌ఉట్నూరు ప్రధాన రహదారిపై గత రెండేళ్లుగా నిలిచిపోయిన ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు బుధవారం తిరిగి ప్రారంభమయ్యాయి.

కెరమెరి ఘాట్ నుంచి టింకపల్లి వరకు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు.దీంతో పవర్గూడ నుంచి టింకపల్లి వరకు ప్యాచ్వర్క్ పనులు ప్రారంభం కాగా ఎమ్మెల్యే పనులను పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు.

ఘాట్ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరిస్తామని కాంట్రాక్టర్ ముంతాజ్కు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.ఆమె వెంట బీఆర్‌ఎస్ నాయకురాలు మార్సుకోల సరస్వతి తదితరులు పాల్గొన్నారు.