రైతుల ఇంటికే వ్యవసాయాధికారులు
- రుణమాఫీ కానివారి వివరాల సేకరణ
- నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, ఆగస్టు 23(విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యల కారణంగా కొందరికి రుణమాఫీ కాలేదని, సమస్యల పరిష్కారానికి వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల ఇంటికి వచ్చి ఫిర్యాదులు తీసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతు వేదికలు, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో రుణమాఫీ పథకంలో తలెత్తిన సమస్యలను పరి ష్కరించే దిశగా చేపట్టిన చర్యల గురించి అధికారులను ఆరా తీశారు.
శుక్రవారం రాష్ట్ర స్థాయి వ్యవసాయ, కో అపరేటివ్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. కుటుంబ నిర్దారణ అయిన వారి రూ.౨లక్షల రుణమాఫీ పూర్తిచేశామని, కుటుంబ నిర్దారణ లేని 4,24,873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు కొత్త యాప్ తీసుకొచ్చినట్టు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన 1,24,545 ఖాతా ల్లో ఇప్పటికే 41,322 ఖాతాలను సరిచేశామని తెలిపారు.
రెన్యువల్ చేసిఖాతాలకు సొమ్మును తిరిగి చెల్లించే విధంగా, మాఫీ అయిన ఖాతాలకు సంబంధించి కొత్త రుణా లు మంజూరు చేసే విధంగా బ్యాంకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించారు. రూ.2 లక్షలకు పైన అప్పులు ఉన్న ఖాతాదారులకు సంబంధించి కూడా త్వరలోనే దశల వారీగా మాఫీని వర్తింపజేస్తామని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, సహకార శాఖ డైరెక్టర్ ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.






