రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు కృషి
సింగరేణి భూసేకరణ పరిహారంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష...
పెద్దపల్లి (విజయక్రాంతి): భూసేకరణ కింద భూములు అందించే రైతులకు నిబంధనల ప్రకారం సింగరేణి సంస్థ ద్వారా మెరుగైన పరిహారం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కోర్టు ఆదేశాల ప్రకారం రైతులు, సింగరేణి సంస్థ ప్రతినిధులతో సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సింగరేణి భూసేకరణ పరిహారంపై సంబంధిత రైతులతో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి. వేణుతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష మాట్లాడుతూ.. రామగిరి మండలం సుందిల్ల, ముత్యాల గ్రామాలలో సింగరేణికి సంబంధించిన భూసేకరణ అంశంపై రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామనని నిబంధన ప్రకారం ఎంత వీలైతే అంత సింగరేణి సంస్థ నుంచి రైతులకు అధికంగా పరిహారం అందించేందుకు కృషి చేస్తామని, భూసేకరణ ప్రక్రియకు రైతులు కూడా సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సింగరేణి జిఎం 1 లలిత్ కుమార్, రామగిరి తహసిల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






