25 May, 2026 | 1:04 AM

అనర్హులకు పెన్షన్లు!

25-05-2026 12:00 AM
  1. వయస్సు లేని వారికి మంజూరు?
  2. గ్రామాల్లో రాజకీయ ప్రభావం 
  3. అర్హులకు అందకుండా పోతున్న ప్రభుత్వ సాయం

మధిర, మే23(విజయ క్రాంతి): మధిర మండలాలు, గ్రామపంచాయతీల పరిధిలో వృద్ధాప్య పెన్షన్ల పంపిణీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు లేకున్నా కొందరు వ్యక్తులు రాజకీయ పలుకుబడి, స్థానిక ప్రభావంతో ప్రభుత్వ పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు గ్రామస్థాయిలో విపరీతంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వయస్సు అర్హత పూర్తి కాకపోయినా మధ్యవర్తుల ద్వారా జనన ధ్రువీకరణ పత్రం పొంది దాని ఆధారంగా పెన్షన్లు పొందుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క వృద్ధాప్య పెన్షన్ కు 10,000 నుండి 15,000 మీకు ఇప్పిచ్చేలా అధికారులతో మాట్లాడతామని దళారులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. 

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ అథెంటిఫికేషన్ విధానం పారదర్శకత కోసం తీసుకొచ్చినప్పటికీ, కొంతమంది దానిని అక్రమాలకు వేదికగా మార్చుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో నిజంగా అర్హత ఉన్న వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తుండగా, అర్హతలు లేని వారు జాబితాల్లో కొనసాగుతున్నారని ప్రజలు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో పెన్షన్ లబ్ధిదారుల వయస్సు వివరాలు, ఆధార్ నమోదు వివరాలు, స్థానిక ధృవీకరణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అధికారులు సరైన పరిశీలన చేయకపోవడం వల్ల అక్రమాలకు అవకాశం కలుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ కాలంలో అర్హతలు లేని పలువురు జాబితాల్లో చేరారని, ఇప్పటికీ అదే కొనసాగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామపంచాయతీలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. లబ్ధిదారుల వయస్సు ధృవీకరణ, కుటుంబ ఆర్థిక పరిస్థితి, ఫేస్ అథెంటిఫికేషన్ నమోదు ప్రక్రియపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన సిబ్బంది లేదా మధ్యవర్తులపై కూడా విచారణ జరిపి ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నిజమైన అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.