2 June, 2026 | 3:06 AM

నేటి నుంచే ఈహెచ్‌ఎస్ అమలు!

02-06-2026 02:16 AM

ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగై వైద్య సేవలు

ఉద్యోగ సంఘాలతో సీఎస్ రామకృష్ణారావు సమావేశం 

రాబోయే వారం రోజుల్లో విధివిధానాలు జారీ చేస్తామని వెల్లడి

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికి మంగళవారం నుంచి హెల్త్‌కేర్ ట్రస్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గుర్తింపు పొందిన ఆసుపత్రులలో వైద్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిసింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణరావు సోమవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో సచివాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈహెచ్‌ఎస్ అమలుపై సంఘాల నేతలకు స్పష్టత ఇవ్వడంతో పాటు, పలు అంశాలపై చర్చించి వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి అభిష్టం మేరకు మంగళవారం నుంచి ఈహెచ్‌ఎస్ పథకం ప్రారంభించే క్రమంలో ఉద్యోగుల వేతనాలు నుంచి కోత విధించాల్సి వచ్చిందని సంఘాల నాయకులకు సీఎస్ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఉద్యోగులుకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధిని పర్యవేక్షించే ‘ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్’ ఒక స్వయంప్రతిపత్తి సంస్థగా పనిచేస్తుందన్నారు. ఉద్యోగులు అందించే 1.5 శాతం కాంట్రిబ్యూషన్‌కు సమానంగా ప్రభుత్వ వాటాను కూడా అదే రోజున ట్రస్ట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ఈ పథకం పర్యవేక్షణ కోసం రాబోయే 2 నుండి 3 రోజుల్లో ప్రత్యేక ఈహెచ్‌ఎస్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. పూర్తి నిబంధనలు, విధివిధానాలను రాబోయే 7 రోజుల్లో రూపొందించనున్నట్లు తెలిపారు.

సమావేశానికి కార్మిక, ఉపాధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిషోర్, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బీఎండీ ఎక్కా, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్. చోంగ్తూ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి యోగితా రాణా, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీ ఎన్. నికోలస్ హాజరయారు. 

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేవనెత్తిన అంశాలు

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తరపున తమ అభిప్రాయాలను, సూచనలను ప్రభుత్వానికి వివరించారు. ‘భార్య భర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయిన సందర్భంలో ఒక్కరి నుంచే సబ్‌స్క్రిప్షన్ మినహాయించాలి. పోలీస్ శాఖలో, ఆబ్కారీ శాఖలో వేరు వేరు పేర్లతో ఇప్పటికే ఆరోగ్య పథకాలు అమలు అవుతున్నాయి. ప్రస్తుతం ఈహెచ్‌ఎస్‌లో కూడా మినహాయిస్తారా? అయూష్ ఆసుపత్రులలో కూడా వైద్యం పొందేందుకు అనుమతించాలి.

కుటుంబ సభ్యులను పరిగణించే సందర్భంలో సోదరి, సోదరులను కూడా అనుమతించాలి. భార్య భర్తలలో ఒకరు ఉద్యోగి మరొకరు పెన్షనర్ అయినప్పుడు ఎవరి నుంచి ప్రీమియం తీసుకుంటారు? సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవడానికి అనుమతించాలి. అవివాహితులైన సంతానానికి 25 సంవత్సరాలు దాటినప్పటికీ వారిని కూడా పథకంలో ఉంచాలి. హెల్త్ ఇతర రాష్ట్రాల ఆసుపత్రులలో చికిత్సకు అనుమతిస్తారా? సర్వీస్ పెన్షనర్, ఫామిలీ పెన్షనర్‌లు ఒక్కరే ఉన్న సందర్భాల్లో ప్రీమియం ఎలా మినహాయిస్తారు.

ప్రతి నెల మినహాయించబడ్డ ప్రీమియం వెంటనే ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో జమ కావాలి. చికిత్సకు అయ్యే విషయంలో అప్పర్ లిమిట్ ఉందా? ప్యాకేజీల వివరాలు ఏమిటి? అత్యవసర సమయంలో ఏ హాస్పిటల్ లో నైనా చేరేందుకు అనుమతించాలి వంటి అంశాలు, సందేశాలను వారు వ్యక్తం చేశారు.

టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, టీజీఓ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్ రావు, బి.శ్యామ్, టీజీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి, ఎస్టీయూ అధ్యక్షుడు సదానంద్ గౌడ్, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి, టి క్లాస్-4 ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దాస్యా నాయక్, టీఎస్ యూటీఎప్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, టీఆర్టీఎఫ్ అధ్యక్షుడు కటకం రమేష్, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు.