17 July, 2026 | 11:09 AM

విద్యుత్ ప్రమాదాల జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోండి

17-07-2026 11:09 AM

సీనియార్టీ ప్రకారం అర్హులైన విద్యుత్ ఉద్యోగులందరికీ  పదోన్నతులు

స్పాట్ బిల్లర్లకు రేట్లు  పెంచడంతోపాటు అవసరం మేరకు అన్ మ్యాన్డ్ కార్మికులను తీసుకుంటాం

భద్రాచలంలో మొబైల్ ట్రాలీ డిటిఆర్ ప్రారంభించిన ఎన్పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి

భద్రాచలం (విజయక్రాంతి): విద్యుత్ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి రక్షణతో విధులు నిర్వహించాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. భద్రాచలం, మణుగూరులోని ఈఆర్ఓ కార్యాలయాలను ఆయన సందర్శించారు. అనంతరం భద్రాచలం డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సంస్థల పని చేసే అన్ని విభాగాల అధికారులు,  ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు. భద్రాచలం వచ్చే భక్తులతో పాటు గోదావరి పరివాహక మండలాల్లోని ప్రజలు విద్యుత్ అంతరాయం సమస్యతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు అవసరమైన అన్నీ చర్యలు తీసుకోవాలన్నారు.

గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి గోదావరి పవిత్ర స్నానాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున విద్యుత్ పరమైన సమస్యలు ఎదురుకాకుండా,  అవసరమైన అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే అక్కడ చేరుకునే విధంగా మొబైల్ ట్రాలీ విద్యుత్ నియంత్రణకులు (డీటీఆర్)లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.

స్పాట్ బిల్లర్లకు రేట్లు పెంచుతామని, అవసరం మేరకు ఆన్ మ్యాన్డ్ కార్మికులను కూడా  తీసుకుంటామని అన్నారు. విద్యుత్తు ఉద్యోగులు, అధికారులు, కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నామని, అంతిమంగా వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సేవలందించడమే అందరి లక్ష్యం కావాలని ఆయన సూచించారు. భద్రాచలం డివిజన్లోని పలు మండలాల్లో  ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపట్టిన  అభివృద్ధి పనులను అధికారులు ప్రొజెక్టర్ ద్వారా సీఎండీకి వివరించారు. భద్రాచలం గాంధీ పార్క్ లో సిబ్బందితో కలిసి సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ (SE) జి.మహేందర్, భద్రాచలం డిఈ జీవన్ కుమార్, ఎమ్మార్టీ డిఈ వెంకటేశ్వరరావు, ఏడీఈలు నరసింహారావు, ఉమామహేశ్వరరావు, వేణు, ఏఈలు కె.రాజారావ్, ఉపేందర్, రోహిణి, జ్యోతి, కార్మిక సంఘాల నాయకులు వెంకట్రాజు, రామకృష్ణ, ఉదయ్, మూర్తి తో పాటు భద్రాచలం డివిజన్లోని అన్ని విభాగాల విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.