2 June, 2026 | 2:58 AM

తెలంగాణ రక్షణ కవచమే బీఆర్‌ఎస్

02-06-2026 02:14 AM
  1. దిక్కుతోచని స్థితి నుంచి దేశానికే దిక్సూచీ చేశాం 
  2. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం ఘనత బీఆర్‌ఎస్‌దే
  3. మన అస్తిత్వానికి మరోసారి ప్రమాదం..
  4. ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు
  5. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): తెలంగాణకు ఎల్లప్పుడూ రక్షణ కవచంగా బీఆర్‌ఎస్ ఉన్నదని, పాలించిందని, ఇకపై కూడా ఉంటోందని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. దిక్కుతోచని స్థితి నుంచి దేశానికే దిక్సూచీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దామన్నారు. ఎడారి లాంటి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. మన అస్తిత్వానికి మరోసారి ప్రమాదం పొంచి ఉందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతన్న సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధిని పాలకులు విస్మరించొద్దని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ మేరకు సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచీలా మార్చుకున్నామని తెలిపారు. ‘పరిపాలన చేతగాదు’ అని విమర్శించిన నోళ్లు మూతపడేలా ప్రగతి పాలన అందించామని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల మీద దశాబ్దా ల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. 

నూతన రాష్ట్రంగా ఏర్పాటైన పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని వివరించా రు. సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్యా వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కేసీఆర్ తెలిపారు. ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ హెచ్చరించారు.

ప్రతీకార శక్తుల నుంచి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని పిలుపునిచ్చారు. తెలంగాణకు బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. స్వరాష్ట్ర సాధనలో నూ, ఆ తర్వాతి పదేండ్ల పునర్నిర్మాణంలోనూ చూపిన స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని, అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకోవాలని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. 

తెలంగాణ రైతన్న సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు  విస్మరించకూడదని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు, సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కేసీఆర్ కోరారు. 

తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం! 

పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు బీఆర్‌ఎస్ పిలుపు

తెలంగాణ వ్యతిరేక కుట్రలను ఛేదిద్దాం.. మన తెలంగాణను కాపాడుకుందామని బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ నేల ఆత్మగౌరవం, అస్తిత్వ రక్షణ కోసం తెలంగాణ సైనికులుగా నిరంతరం పోరాడదామని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డ ఈ ప్రతిజ్ఞ చేద్దామని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా బీఆర్‌ఎస్ పార్టీ స్పందించింది.

ఎన్నో అవమానాలు, అవహేళనలు.. మరెన్నో త్యాగాలు.. కుట్రలు జరిగినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు అని గుర్తు చేసింది. అప్పటి లక్ష్యం రాష్ట్ర సాధన.. ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటమని స్పష్టం చేసింది. తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన శుభ దినాన.. గులాబీ సైన్యమంతా కదం తొక్కాలని పిలుపునిచ్చింది. ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో మువ్వొన్నెల జెండాతోపాటు మన గులాబీ జెండానే సగర్వంగా ఎగరేద్దామని సూచించింది. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పండుగలా జరుపుకుందామని పేర్కొంది.