30 March, 2026 | 2:38 AM

ఘనంగా ఈద్ మిలాప్

30-03-2026 12:59 AM

మహబూబాబాద్, మార్చి 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణంలో జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొహతరమా షహనాజ్ బెగం సాహెబా (ఎడిటర్, అనుపమ మ్యాగజైన్), డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమజాన్ పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న ఈద్ మిలాప్ కార్యక్రమం మత సామరస్యానికి ప్రతీక అని తెలిపారు.

అందరూ పరస్పర సహకారం, పేదల పట్ల సానుభూతి, నైతిక విలువలు పాటించడం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని, తద్వారా రాబోయే తరాలకు సుఖసంతోషాలతో కూడిన మంచి భవిష్యత్తు అందించగలమని చెప్పారు. భారతీయ సంస్కృతి హిందూ, ముస్లిం, సిక్కు, పార్సీ అందరూ అన్నదమ్ముల్లా కలిసి జీవించే గొప్ప సంస్కృతి అని వివరించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ సబహత్ నాజియా ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎండి వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 71వ ర్యాంకు సాధించిన నేపథ్యంలో ఆమెను ఘనంగా సత్కరించారు. అలాగే నూతనంగా ఎన్నికైన మహిళా మున్సిపల్ కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షురాలు టీ. పుష్పలీల, జిల్లా నాజిమా ఆసియా క్వానం, స్థానిక నాజిమా హబీబ్ ఉన్నిసా బేగమ్, జమాత్ మహిళా కార్యకర్తలు, సభ్యులు పాల్గొన్నారు.