14 June, 2026 | 5:41 PM

ఆరోగ్య కార్డులు వెంటనే మంజూరు చేయాలి

14-06-2026 04:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టియుటిఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మ లచ్చిరాం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల మే నెల వేతనం నుండి 1.5 శాతం  ఈహెచ్ఎస్ చందా వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మార్గదర్శకాలు రూపొందించకపోవడం శోచనీయమన్నారు. వెంటనే అన్ని కార్పోరేట్ ఆసుపత్రులలో అమలయ్యే విధంగా ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 30 తేదీ లోపు రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని వస్తున్న వార్తల పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో  1-9 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని, 60 మంది విద్యార్థులకు 5 గురు ఉపాధ్యాయులు ఉండాలని, ఆపైన ప్రతి 20 మందికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని కోరారు. విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులు ఉండడం సరైన విధానం అన్నారు.

317 జీవో బాధిత ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు చేయాలని, మిగిలిపోయిన స్పౌజ్ బదిలీలు పూర్తి చేయాలని కోరారు. జూలై 31 తేదీ కట్ ఆఫ్ తో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, ప్రతి మండలాన్ని రెండు క్లస్టర్ లుగా విభజిస్తూ  ఒక MEO పోస్టును ప్రభుత్వ యాజమాన్యంలోని GHM Gr-2 ద్వారా, మరొక MEO  పోస్టును లోకల్ బాడీ GHM Gr-2 ద్వారా భర్తీ చేయాలని సూచించారు. ప్రత్యక్ష నియామకాల కంటే ముందే డైట్ లెక్చరర్,GHM Gr-1, డిప్యూటీ ఈవో పోస్టులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉపాధ్యాయుల సంఖ్యలో  అసమతుల్యత, కొత్తగా PET, PDఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం తదితర కారణాల దృష్ట్యా కాంప్లెక్స్ పాఠశాలను రీఆర్గనైజ్ చేస్తూ సమావేశాలను 6 నుండి 3కు  కుదించాలని కోరారు. జూన్ 30వ తేదీ లోపు పిఆర్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల కుదింపు ఆలోచనను విరమించుకోవాలని, CPS  ను రద్దుచేసి OPS ను పునరుద్ధరించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.