25 March, 2026 | 1:27 AM

సలేశ్వరం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

25-03-2026 12:01 AM

జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్, మార్చి 24 (విజయక్రాంతి): తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి 3 వర కు నిర్వహించనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్, డీఎఫ్‌ఓ రేవంత్ చంద్ర తదితరులతో కలిసి జాతర ఏర్పాట్లపై చర్చించారు.

జాతరకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా వంటి అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని కలెక్టర్ సూచించారు. ఫారహాబాద్ మార్గం ద్వారా భక్తులను అనుమతిస్తామని తెలిపారు. నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, అచ్చంపేట డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు విరివిగా నడపాలని అధికారులకు ఆదేశించారు.రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్గమధ్యంలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని, వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్, అటవీ శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అడవిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని తెలిపారు.గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు జాతరకు రాకపోవడం మంచిదని కలెక్టర్ సూచించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, సలేశ్వరం ఆలయ కమిటీ సభ్యులు, చెంచు సంఘాల నాయకులు పాల్గొన్నారు.