ఎనిమిదిన్నర తులాల బంగారం దోపిడీ

06-10-2026 | 04:00pm
  1. పోలీసులమంటూ నమ్మించి.. బంగారం, నగదు అపహరణ
  2. వృద్ధురాలి వద్ద 6 తులాల గాజులు, 2.5 తులాల చైన్, రూ.2 వేల నగదు మాయం

బోధన్, అక్టోబర్ 06 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో (Bodhan town)పోలీసులమంటూ నమ్మించి ఓ వృద్ధురాలి వద్ద నుంచి భారీగా బంగారు ఆభరణాలు, నగదును(Gold jewelry and cash) దోచుకెళ్లిన ఘటన మంగళవారం రోజున కలకలం రేపింది. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు పోలీసులమని చెప్పి వృద్ధురాలిని మభ్యపెట్టి సుమారు ఎనిమిదిన్నర తులాల బంగారం, రూ.2 వేల నగదును అపహరించారు.

బోధన్ మండలం సాలంపాడు గ్రామానికి చెందిన తిరుపతమ్మ అనే వృద్ధురాలు మరో మహిళతో కలిసి టీవీఎస్ మోపెడ్‌పై బోధన్‌లోని ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో రంగారావు దాబా సమీపంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారి వాహనాన్ని అడ్డగించారు.

తాము పోలీసులమని పరిచయం చేసుకున్న వారు బైపాస్ రోడ్డులో దొంగలు తిరుగుతున్నారని, బంగారు ఆభరణాలు ధరించి వెళ్లడం సురక్షితం కాదని వృద్ధురాలిని భయపెట్టినట్లు సమాచారం. అనంతరం ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు చైన్, ఆరు తులాల బంగారు గాజులను తీసి పర్సులో పెట్టుకోవాలని సూచించారు.

వృద్ధురాలు వారి మాటలను నమ్మడంతో ఆభరణాలను కవర్లో పెట్టి ఇస్తామని చెప్పి ఆమెకు ఖాళీ కవర్‌ను అందించినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులు వెళ్లిపోయారు. తిరుపతమ్మ ఆసుపత్రికి చేరుకున్న తర్వాత పర్సును పరిశీలించగా అందులోని బంగారు ఆభరణాలతో పాటు రూ.2 వేల నగదు కూడా కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.

బంగారం పోయిన విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురైన వృద్ధురాలు అక్కడే కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు బోధన్ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఘటనకు సంబంధించిన ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

పోలీసులమంటూ నమ్మించి వృద్ధురాలి వద్ద భారీగా బంగారం దోచుకెళ్లడంతో బోధన్ పట్టణంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు