విద్యుత్తు ప్రమాదాలు తగ్గించాలి
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
హనుమకొండ, జూన్ 10 (విజయక్రాంతి): విద్యుత్తు ప్రమాదాలు తగ్గిం చేందుకు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ విధిగా భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ పరిధిలోని 16 సర్కిళ్ల టెక్నికల్ డివిజన్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లతో టెలీకాన్ఫ్‌రెన్స్ నిర్వహించారు. తరచుగా జరిగే విద్యుత్తు ప్రమాదాలు ఆందోళనకు దారితీస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రధానంగా గృహాల్లో నాణ్యమైన వైరింగ్ లేకపోవడం, నాసిరకమైన విద్యుత్తు పరికరాలు వాడటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలిపారు. రైతులు స్విచ్‌బోర్డు, స్టార్టర్ల దగ్గర భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నట్టు వివరించారు. ప్రమాదాల నివారణకు అన్నిరకాల సంస్థాగత మార్పులతోపాటు సర్కిళ్లవారీగా డివిజనల్ ఇంజినీర్లను నోడల్ సేఫ్టీ అధికారులుగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సీఎండీ సూచనలు
*విద్యుత్తు ప్రమాదాలపట్ల ప్రజలు, రైతులు, టీజీఎన్పీడీసీఎల్ సంస్థ సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుట
* భద్రతాపరికరాలపై అవగాహన కల్పించి, పూర్తిస్థాయిలో వాటిని ఉపయో గించేలా చర్యలు తీసుకోవడం.
* ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులను ముందస్తుగా గుర్తించి రక్షణ చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడం.
*ఉద్యోగస్తులు భద్రతపట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అలాగే డివిజనల్ ఇంజినీర్స్ టెక్నికల్, సర్కిల్ ఆఫీస్ నోడల్ సేఫ్టీ ఆఫీసర్ ఓఅండ్‌ఎమ్ సిబ్బంది భద్రతా నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారో లేదో తనిఖీ చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్తు ప్రమాదాల జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన పెంపొదించేందుకు మున్సిపాలిటీ, కార్పొరేషన్, బస్టాండ్, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు, సినిమా థియేటర్లు, క్రాస్ రోడ్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు మొదలైన ప్రదేశాల్లో విద్యుత్తు భద్రతా అవగాహన సదస్సులు, నివారణ సూచనలు, జాగ్రత్తలు తెలియజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు.






