9 July, 2026 | 1:32 PM

భూకబ్జా కేసులో ఆర్వో, మరొకరు అరెస్ట్

11-06-2024 12:45 AM

జగిత్యాల మున్సిపల్ కమిషనర్, మరొకరు పరారీ

జగిత్యాల, జూన్ 10 (విజయక్రాంతి): భూకబ్జా కేసులో మున్సిపల్ ఆర్వోతోపాటు మరొకరిని పోలీసులు అరెస్టు చేయగా.. మున్సిపల్ కమిషనర్ అనిల్, మరొకరు పరారీలో ఉన్నారని జగిత్యాల సీఐ వేణుగోపాల్ తెలిపారు. జగిత్యాల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్‌లో సర్వే నంబర్ 1599లో భూకబ్జాకు సంబంధించి విజయక్రాంతి దిన పత్రికలో వచ్చిన కథనానికి జిల్లా కలెక్టర్ స్పందించారు. అక్రమార్కులకు సహకరించిన మున్సి పల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

సీఐ వేణుగోపాల్ కథనం ప్రకారం బాధితులు కీర్తి విజయలక్ష్మి, కరుణాకర్, గీతారాణి, గొల్లపల్లి సత్యనారా యణలు 2011లో జగిత్యాల సమీపంలో గల హస్నాబాద్ శివారులో సర్వేనంబర్ 1599 లో 12 గుంటల భూమిని కొనుగోలు చేశారు. భూమికి పూర్తి హక్కుదారుగా ఉన్నారు. కాగా ఆ భూమిపై కన్నేసిన జగిత్యాలకు చెందిన ఖాజా అమిరుద్దీన్ అలియాస్ నుమాన్, ఎండీ జాకీర్ ఆలీ అలియాస్ హిలాల్ సుల్తాన్, ఇమ్రాన్‌లు సదరు భూమి కి సంబంధించిన సాదాబైనామా నకిలీ రికార్డ్స్ 13బీ, 13-సీ, మ్యాప్ సృష్టించి మున్సిపల్ రెవెన్యూ అధికారి (ఆర్వో) బడుగు ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అనిల్ సాయంతో నకిలీ ఇంటి నంబర్, నకిలీ ఆస్తి అసెస్‌మెంట్ పత్రాలను సృష్టించారు.

నకిలీ ఇంటి నంబర్‌పైన 2012 అక్టోబర్ నుంచి 2025 మార్చి31 వరకు రూ.97,500 పన్ను చెల్లించారు. ఉద్దేశపూర్వకంగానే వీరు నకిలీ కాగితాలు సృష్టించి సర్వేనంబర్ ౧౫౯౯లోని ౭౨౬ గజాల స్థలాన్ని అమ్మి వాటాలుగా పంచుకుందామని నిర్ణయించుకున్నారు. ప్లాటును ఆక్ర మించుకోగా, అసలు యజమానులు వెళ్లి అడ్డుకున్నారు. వీరిని అమీరుద్దీన్, ఎండీ ముజాకిర్ అలీ తమ మిత్రులతో కలసి బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఖాజా అమీరుద్దీన్, ఎండీ ముజాకిర్ అలీ, మున్సిపల్ ఆర్వో బడుగు ప్రసాద్‌ను అరెస్టు చేసి, జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. మున్సిపల్ కమిషనర్ అనిల్, ఇమ్రాన్ పరారీలో ఉన్నట్టు సీఐ వెల్లడించారు.