4 May, 2026 | 11:12 AM

ఎలివేటెడ్ కారిడార్‌కు మోక్షం దొరికినట్లేనా!

25-06-2024 05:54 AM
  • ఉప్పల్ కారిడార్ సమస్యను కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి 
  • కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పనుల్లో జాప్యం
  • ఆరేళ్లుగా 40 శాతం పూర్తికాని పనులు

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 24 (విజయక్రాంతి): ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌పై ఆశలు చిగురిస్తున్నాయి. సోమవారం కేంద్ర మంత్రి నితి న్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయం లో రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి తెలంగాణలో జాతీ య రహదారుల పనుల పురోగతిపై చర్చించారు. ఇందులో ప్రధానంగా ఉప్పల్ పల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల వాస్తవ పరిస్థితిని గడ్కరీకి వివరించినట్లు ఢిల్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. నగర శివారులోని ఉప్పల్, మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో వాహన రద్దీని నియంత్రించడంతో పాటు యాదాద్రి, వరంగల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రించాలనే లక్ష్యంతో వరంగల్ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభు త్వం రూ. 626.76 కోట్ల ప్రతిపాదనలతో, 2018 మే 8వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.

ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని పీర్జాదిగూడ సీపీఆర్‌ఐ రోడ్డు వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను అంచనా వ్యయం రూ.626.76 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో నిర్మాణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, భూసేకరణ ఖర్చు రూ.768.26 కోట్లను, అలాగే రూ.311 కోట్ల నిధులతో ఉప్పల్ జంక్షన్ వద్ద మెట్రోపై నుంచి ఫ్లు ఓవర్‌ను  రాష్ర్ట ప్రభుత్వమే నిర్మిస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో 148 పిల్లర్ల ను, 45 మీటర్ల వెడల్పుతో కారిడార్‌తో పాటు కారిడార్‌కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీస్ రోడ్డును నిర్మించేం దుకు ఓ నిర్మాణ సంస్థకు పనులు అప్పగించారు. అయితే, 2018 మే 8వ తేదీన ప్రారంభమైన కారిడార్ పనులు ఒప్పందం ప్రకారం 2020 నాటికే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆరేళ్లు గడిచినా నేటికీ పిల్లర్లే దర్శనమిస్తున్నాయి. 

తప్పని తిప్పలు..

ఈస్ట్ హైదరాబాద్ ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ ఐటీ సంస్థలతో పాటు అనేక పారిశ్రామిక వాడలు ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్నా యి. అలాగే తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదాద్రి సందర్శకులకు ఇదే ప్రధాన రహదారి. దీంతో ఈ రహదారిపై  ప్రతిరోజు సుమారు లక్ష వాహనాలు రాకపోకలు సాగిస్తాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొంటున్నారు. కానీ ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు గత ఆరేళ్లుగా నత్తనడకన సాగుతుండటంతో పాటు జాతీ య రహదారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాదారులకు తిప్పలు తప్పడం లేదు.

ఉప్పల్ నుంచి పీర్జాదిగూడ వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి వినతి మేరకు 2023లో నాటి సీఎం కేసీఆర్ రూ.3 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఉప్పల్ నుంచి పీర్జాదిగూడ వరకు జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చడంతో పాటు బీటీ రోడ్డు వేశారు. దీంతో కొంత ఉపశమనం లభించినా కారిడార్ పనులు జరు గుతుండటంతో ఏళ్లకు ఏళ్లు జాతీయ రహదారిపై బారికేడ్లు, క్రేన్లు, భారీ పిల్లర్లు ఉన్న కారణంగా వాహనాదారులకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగిస్తే పనులు త్వరితగతిన పూర్తవుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ కాంట్రాక్టును ఎన్ని రోజుల్లో రద్దు చేస్తారు, కొత్త టెండర్లను పిలిచి ఎన్ని రోజుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారు అనే అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.