13 July, 2026 | 6:26 PM

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

25-06-2024 05:51 AM
  • స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

మర్పల్లి పీహెచ్‌సీ తనిఖీ

డాక్టర్ విధుల్లో లేకపోవడంపై ఆగ్రహం

వికారాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం మర్పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో ఉండాల్సిన డాక్టర్ లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఒక హెడ్ నర్సు, మరో సిబ్బంది మాత్రమే విధుల్లో ఉన్నారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో డాక్టర్ సంతకం ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై డీఎంహెచ్‌వో డాక్టర్ పాల్వన్ కుమార్‌కు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ రావడంతో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. డాక్టర్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి విధుల్లో లేని విషయాన్ని  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, విచారణ జరిపిస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సకాలం లో వైద్యం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అన్నారు.