28 May, 2026 | 7:19 PM

టీయూవీ రాష్ట్ర కార్యదర్శిగా ఎల్తూరి శంకర్

28-05-2026 06:08 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన ఎల్తూరి శంకర్ తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు టీయూవీ వ్యవస్థాపక చైర్మన్ నరాల సత్యనారాయణ, వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్‌లు ఆయనకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎల్తూరు శంకర్  మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, ప్రభుత్వపరంగా వారికి లభించాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చూడటమే సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు.

అలాగే,గతంలో ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం పోరాడేందుకే తెలంగాణ ఉద్యమకారుల వేదికను ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సంస్థను మరింత బలోపేతం చేసేందుకు, యాక్టివ్‌గా పనిచేస్తున్న ఎల్తూరి శంకర్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా, తన నియామకానికి సహకరించిన టీయూవీ రాష్ట్ర అధిష్ఠానానికి ఎల్తూరి శంకర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం, సంస్థ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.